Chandrababu CID Custody : స్కిల్ కేసులో చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం, ముగిసిన తొలిరోజు విచారణ!-rajahmundry skill scam cid questioned chandrababu enquired skill development pact ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Cid Custody : స్కిల్ కేసులో చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం, ముగిసిన తొలిరోజు విచారణ!

Chandrababu CID Custody : స్కిల్ కేసులో చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం, ముగిసిన తొలిరోజు విచారణ!

Bandaru Satyaprasad HT Telugu
Sep 23, 2023 07:04 PM IST

Chandrababu CID Custody : స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీడీఐ అధికారులు విచారించారు. సుమారు 6 గంటల పాటు సాగిన విచారణలో సీఐడీ అధికారులు 50 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu CID Custody : స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి రోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్‌ జైలులోని కాన్ఫరెన్స్‌ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం చంద్రబాబును శనివారం ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించింది. సుమారు 6 గంటల పాటు సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించారు. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ సమక్షంలో ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. విచారణకు ముందు, తర్వాత చంద్రబాబుకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

yearly horoscope entry point

50 ప్రశ్నలు

శనివారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో చంద్రబాబును ప్రశ్నించారు. ఉదయం దాదాపు గంటన్నరపాటు చంద్రబాబును ప్రశ్నించిన సీఐడీ అధికారులు... భోజన విరామంతో పాటు మొత్తం నాలుగుసార్లు విరామం ఇచ్చారు. చంద్రబాబు వయసు రీత్యా వైద్యుల బృందాన్ని అందుబాటులో ఉంచారు. అయితే మొత్తం 120 ప్రశ్నలతో విచారణకు వెళ్లిన సీఐడీ బృందం 50 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీమెన్స్‌ సంస్థతో ఒప్పందం, లావాదేవీలపై ముఖ్యంగా చంద్రబాబును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్‌ కంపెనీలు, సాక్ష్యాధారాలు లేకుండా చేసే ప్రయత్నాలపై సీఐడీ ప్రశ్నించింది. డీపీఆర్‌ లేకుండా ఎందుకు ప్రాజెక్టుకు అనుమతి తెలిపారు? ఆర్థికశాఖ సెక్రటరీ వద్దన్నా, నిధులు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నలు వర్షం కురిపించారు.

అచ్చెన్నాయుడు పాత్రపై ఆరా

గంటా సుబ్బారావుకు ఎందుకు నాలుగు పదవులు కట్టబెట్టారు? సీమెన్స్ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌తో ఏమైనా రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా? సుమన్ బోస్ తో గంటా సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్‌ వివరాలేంటి?. ఇందులో అచ్చెన్నాయుడు పాత్ర ఏంటి? రూ.మూడు వేల కోట్లు గురించి అడగొద్దని అధికారులను ఎందుకు అడ్డుకున్నారు? గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను డిస్కౌంట్‌గా ఎందుకు మార్చారు? వంటి ప్రశ్నలు సీఐడీ అధికారులు చంద్రబాబుకు సంధించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు విచారణను సీఐడీ అధికారులు వీడియో తీశారు. ఈ వీడియోను సీల్డ్ కవర్ లో ఏసీబీ కోర్టుకు సమర్పించనున్నారు. చంద్రబాబు తరపు లాయర్లు దమ్మలపాటి శ్రీనివాస్‌, సుబ్బారావుల సమక్షంలోనే సీఐడీ అధికారులు స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు.

చంద్రబాబును రెండ్రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణ మొత్తాన్ని వీడియో తీసి, ఏసీబీ కోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పిస్తారు. విచారణకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఏవీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని కోర్టు ఆదేశించింది.

Whats_app_banner