Nara Bhuvaneswari : ప్రజాధనంపై మాకు ఎప్పుడూ ఆశలేదు, ప్రభుత్వ నిధులను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు- నారా భువనేశ్వరి
Nara Bhuvaneswari : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్ష చేశారు. ప్రభుత్వ నిధులను చంద్రబాబు ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని భువనేశ్వరి అన్నారు.
Nara Bhuvaneswari : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసగా గాంధీ జయంతి రోజు టీడీపీ సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు టీడీపీ నారా భువనేశ్వరి, లోకేశ్, టీడీపీ శ్రేణులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టాయి. రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, దిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన సత్యమేవ జయతే దీక్ష ముగిసింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు 8 గంటలపాటు టీడీపీ నేతలు నిరాహార దీక్ష చేశారు. లోకేశ్, టీడీపీ ఎంపీలతో పాటు కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. దిల్లీలో లోకేశ్ సత్యమేవ జయతే దీక్షకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో పాటు దిల్లీలోని తెలుగు సంఘాలు, దిల్లీ యూనివర్సిటీ తెలుగు విద్యార్థులు మద్దతు తెలిపారు.
దీక్ష విరమించిన నారా భువనేశ్వరి
రాజమండిలో నారా భువనేశ్వరి దీక్ష విరమించారు. అనంతరం మాట్లాడుతూ... సత్యమేవ జయతే దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజల బాగు కోసమే దీక్షలో పాల్గొన్నానన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన గాంధీజీనే జైలులో పెట్టారన్నారు. కుటుంబానికి కొంత సమయం కేటాయించాలని చంద్రబాబును కోరేదాన్ని అని, ఎప్పుడూ ప్రజల బాగు కోసమే చంద్రబాబు పరితపించారన్నారు. నా ఆయుష్షు కూడా పోసుకుని చంద్రబాబు జీవించాలని భువనేశ్వరి అన్నారు. ప్రభుత్వ నిధులను మేం ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదన్నారు. ఇప్పటి వరకూ మా కుటుంబసభ్యులపై ఒక్క కేసు కూడా లేదని, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకెళ్లారని తెరిపారు.
హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి చంద్రబాబు కృషి
"రాష్ట్రం, ప్రజల బాగు కోసమే నిత్యం చంద్రబాబు ఆలోచించేవారు. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారు. ప్రజల కోసం చంద్రబాబు రోజుకు 19 గంటలు కష్టపడేవారు. చంద్రబాబు రోజుకు 3, 4 గంటలే నిద్రపోయేవారు. చంద్రబాబు పదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి జరిగేది. ఈసారి మీ ఓటును సరిగా వేయాలని కోరుకుంటున్నాను. ప్రజాధనంపై మాకు ఎప్పుడూ ఆశలేదు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చంద్రబాబు కోరుకునేవారు. చంద్రబాబు అరెస్టు చూసి మనస్తాపంతో 105 మంది మరణించారు. మరణించిన 105 మంది కుటుంబాలను త్వరలో పరామర్శిస్తాను"- నారా భువనేశ్వరి
చంద్రబాబును జైలుకు పంపడమే జగన్ లక్ష్యం
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నారా లోకేశ్ దిల్లీలో సోమవారం సత్యమేమ జయతే దీక్ష చేపట్టారు. చిన్నారులు లోకేశ్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోకేశ్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో లోకేశ్, టీడీపీ ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ... గాంధీ లాంటి వారు నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకు వెళ్లారన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలైన స్కిల్ డెవలప్మెంట్ ఏపీలో అమలు చేస్తే చంద్రబాబును జగన్ జైలుకు పంపారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబును ఎలా జైలుకు పంపాలనే పనిచేస్తుందని ఆరోపించారు.