Pulivendula Satish Reddy : పులివెందులలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన సతీష్ రెడ్డి
Pulivendula Leader Satish Reddy : పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Pulivendula Leader Satish Reddy: పులివెందుల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత సతీష్‌రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సతీశ్ రెడ్డి చేరిక కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్.అవినాష్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు పలువురు స్ధానిక నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సతీశ్ రెడ్డి... తెలుగుదేశం పార్టీపై విమర్శలుు గుప్పించారు. తన కష్టాన్ని గుర్తించటంతో టీడీపీ విఫలమైందన్నారు. 2020 నుంచి టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నానని చెప్పారు. తనతో మాట్లాడేందుకు పలువురు టీడీపీ నేతలు కూడా వచ్చారని... వారితో నా సమస్యలను కూడా చెప్పానని గుర్తు చేశారు. తన సమస్యలను తెలుసుకుని కూడా టీడీపీ పెద్దలు ఏం చేయలేదన్నారు. దశాబ్ధాల కాలం పాటు జగన్ పై పోరాడుతున్నప్పటికీ... పార్టీలో రావాలని జగన్ పెద్ద మనసు చేసుకుని ఆహ్వానించారని చెప్పారు. ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్తాననే వార్తలు రాగానే... అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు సీన్ లోకి వచ్చి మాట్లాడేందుకు రాయబారం పంపారని విమర్శించారు.
" అవసరం ఒక్క శాతం లేకపోయినప్పటికీ పార్టీలోకి రమ్మని సీఎం జగన్ ఆహ్వానించారు. ఆయన ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తాను. టీడీపీకి దూరమైన తర్వాత చంద్రబాబు గానీ, లోకేశ్ గానీ నాతో మాట్లాడలేదు. లోకేశ్ ఆలోచనలతో పార్టీ నడుస్తుంది. టీటీడీ అనేది ఒక వ్యాపార సంస్థగా మారింది. రాజకీయ పార్టీ మాదిరిగా నడవటం లేదు. జగన్ గారి అభిమానం చూశాక... నేను ఇన్నిరోజులుగా ఎందుకు పోరాటం చేశాననే బాధ కూడా నాలో కలిగింది" అని సతీశ్ రెడ్డి అన్నారు.
కడప జిల్లాలో పులివెందుల అనగానే వైఎస్ కుటుంబం గుర్తుకు వస్తుంది. అయితే జగన్ పై పోటీ చేసిన నేతగా సతీశ్ రెడ్డికి పేరుంది. వైయస్ కుటుంబాన్ని ఓడించాలనే లక్ష్యంతో రాజకీయ ప్రత్యర్థిగా నిలబడ్డాడు సతీష్ రెడ్డి. 25 ఏళ్లగా టిడిపి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ వచ్చారు. పులివెందుల లాంటి ప్రాంతంలో పోటీ చేయటమే కాదు కేడర్ ను కాపాడుకోవటం అతిపెద్ద సవాల్. అయినప్పటికీ సతీశ్ రెడ్డి…. టీడీపీ జెండాను విడిచిపెట్టలేదు. అయితే నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు సతీశ్ రెడ్డి. ముఖ్యంగా బీటెక్ రవి సీన్ లోకి ఎంట్రీ ఇవ్వటంతో సతీశ్ రెడ్డి… ఇబ్బందికరంగా మారిందనే టాక్ జోరుగా వినిపించింది.
వైసీపీలో చేరిన చేగొండి సూర్యప్రకాష్
మరోవైపు జనసేన పార్టీకి చెందిన చేగొండి సూర్యప్రకాష్… ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…. పవన్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏమాత్రం పవన్ కల్యాణ్ చేయలేదని విమర్శించారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనే ఆరాటపడ్డారని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ ను నమ్ముకున్న జనసేన పార్టీ నేతలంతా మోసపోయారని అన్నారు.