IAS Imtiaz Ahmed : వైసీపీలో చేరిన ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ - అసెంబ్లీ బరిలో ఉండటం ఖాయమేనా..?-senior ias officer imtiaz ahmed joined the ysrcp presence of cm ys jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Senior Ias Officer Imtiaz Ahmed Joined The Ysrcp Presence Of Cm Ys Jagan

IAS Imtiaz Ahmed : వైసీపీలో చేరిన ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ - అసెంబ్లీ బరిలో ఉండటం ఖాయమేనా..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 29, 2024 02:34 PM IST

Senior IAS Officer Imtiaz Joined In YSRCP: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ అహ్మద్ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్… ఆయనకు పార్టీ కండువా కప్పారు.

వైసీపీలో చేరిన ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌
వైసీపీలో చేరిన ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ (Twitter)

Senior IAS Officer Imtiaz Joined In YSRCP: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏ.ఎండి ఇంతియాజ్‌ అహ్మద్ వైసీపీలో చేరారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, కర్నూలు మేయర్‌ బి.వై.రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

తాజాగానే ఇంతియాజ్‌ అహ్మద్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ అందజేశారు. ఆయన మైనారిటీ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తు్న్నారు. వీఆర్ఎస్ ఇచ్చిన వెంటనే… ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు అభ్యర్థిగా ఇంతియాజ్ బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. ఇంతియాజ్ వీఆర్ఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది.

ఎన్నికల్లో పోటీ…!

ఇంతియాజ్ అహ్మద్ ది సొంత జిల్లా కర్నూలు. ఆయన గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతియాజ్ పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉంది. అయితే రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఇంతియాజ్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేశారని తెలిసింది. ఆయన కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతియాజ్ మైనారిటీకి చెందిన వ్యక్తి కావడం వైసీపీకి లాభిస్తుందని అధిష్టానం అంచనా వేస్తుంది.

నిజాయితీ గల అధికారిగా పేరున్న ఇంతియాజ్..తన కుటుంబం నిర్వహించే ట్రస్ట్ ద్వారా ప్రజా సేవలో చురుకుగా ఉంటున్నారు. తన బావ డాక్టర్ కె.ఎం.ఇస్మాయిల్ కర్నూలు నగరంలో రూ.2 వైద్యుడిగా పేరుపొందారు. డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ కోవిడ్ -19 సమయంలో మరణించారు. అతను తన సేవలను పేదలకు విస్తరించడానికి కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పేదలు డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ దగ్గర చికిత్స పొందేందుకు కర్నూలుకు వచ్చేవారు. కర్నూలు వైసీపీలో రెండు గ్రూపుల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు అసెంబ్లీకి ఇంతియాజ్‌ ను సిద్ధం చేశారు. గత కొన్నేళ్లుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, స్థానికంగా ఉన్న ఎస్వీ మోహన్‌ రెడ్డి టికెట్ల కోసం ఒకరిపై ఒకరు ఎత్తులు వేస్తు్న్నారు. ఇంతియాజ్‌ ఎంట్రీతో ఈ గొడవకు తెరపడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంతియాజ్ చేరికతో కర్నూలు రాజకీయం ఆసక్తికరంగా మారటం ఖాయంగా ఉంది. ఎస్వీ మోహన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మధ్య టికెట్ ఫైట్ నడుస్తుండగా…. ఇంతియాజ్ ఎంట్రీతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తెగ మార్పులు చేస్తున్న వైసీపీ అధినాయకత్వం…. కర్నూలు సీటు విషయంలో ఎవరివైపు నిలుస్తుందనేది చూడాలి…!

IPL_Entry_Point

సంబంధిత కథనం