Nuzvid IIIT : నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఏమైంది.. ఓవైపు అధ్యాపకుల కొరత.. మరోవైపు నాసిరకం భోజనం!-problems of students due to lack of faculty in nuzvid iiit ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nuzvid Iiit : నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఏమైంది.. ఓవైపు అధ్యాపకుల కొరత.. మరోవైపు నాసిరకం భోజనం!

Nuzvid IIIT : నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఏమైంది.. ఓవైపు అధ్యాపకుల కొరత.. మరోవైపు నాసిరకం భోజనం!

Basani Shiva Kumar HT Telugu
Oct 12, 2024 12:09 PM IST

Nuzvid IIIT : నూజివీడు ట్రిపుల్ ఐటీ.. ఏపీలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ. ఎంతో పేరున్న ఈ విద్యా సంస్థలో.. ఇప్పుడు ప్రమాణాలు పడిపోతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధ్యాపకుల కొరత, నాసిరకం ఆహారం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీ
నూజివీడు ట్రిపుల్ ఐటీ

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మెరుగు పడాల్సిన విద్యా ప్రమాణాలు.. రోజురోజుకూ పడిపోతున్నాయి. ముఖ్యమైన ఈసీఈ, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో అధ్యాపకుల కొరత పెద్ద సమస్యగా మారింది. ఇటు విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం, నాణ్యమైన భోజనం అందించడంలోనూ అధికారులు విఫలమయ్యారనే వాదన ఉంది. దీంతో ప్రాంగణ నియామకాలు మొదలు.. అన్నింటిపైనా ప్రభావం పడుతోంది.

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మొత్తం 7 గ్రూపులు ఉన్నాయి. ఆరు వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం.. ప్రతి 20 మందికి ఒక అధ్యాపకుడు ఉండాలి. వెయ్యి మంది విద్యార్థులకు 50 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ.. ప్రస్తుతం అన్ని గ్రూపులకు కలిపి శాశ్వత అధ్యాపకులు కేవలం 28 మంది మాత్రమే ఉన్నారు. వారిలో 8 మంది స్టడీలీవ్‌‌లో ఉన్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 20 మంది అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. శాశ్వత అధ్యాపకులను నియామించకుండా.. ఒప్పంద సిబ్బందితో తరగతులు నడిపిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎంటెక్‌ విద్యార్హత కలిగిన అధ్యాపకులే బోధించాల్సి ఉంది. ఇక్కడ మాత్రం.. అర్హత, అనుభవం లేని ఐటీ మెంటార్లతో పాఠాలు చెప్పిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.

అధ్యాపకుల కొరతతో అన్ని సబ్జెక్టుల సిలబస్‌ పూర్తి కావటం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ట్రిపుల్‌ఈ గ్రూపు నాలుగేళ్ల కిందట ప్రవేశపెట్టినా.. ఇప్పటి వరకు ప్రయోగశాల లేదని అంటున్నారు. ల్యాబ్‌‌లో కూడా సరైన పరికరాలూ లేవని చెబుతున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో రెండో సెమిస్టర్‌లో ఒక్క ప్రయోగం కూడా చేయలేదని విద్యార్థులు వాపోతున్నారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓవైపు అధ్యాపకుల కొరత వేధిస్తుండగా.. మరోవైపు సౌకర్యాల లేమి వెంటాడుతోంది. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. గతంలో ఒక్క సీఎస్‌సీ నుంచే గేట్‌ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో మొదటి పది ర్యాంకుల్లో కనీసం ముగ్గురుండేవారు. గతేడాది ఈసీఈ, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో 600 మందిలో కేవలం నలుగురే అర్హత సాధించారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లు 60 నుంచి 30 శాతానికి పడిపోయాయి.

ఇటీవల నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వందలాది మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మంత్రి లోకేష్ స్పందించి.. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేదని విద్యార్థులు చెబుతున్నారు. మంత్రి లోకేష్ నూజివీడు ట్రిపుల్ ఐటీపై దృష్టిపెట్టి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Whats_app_banner