Telangana Investments : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ- రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్సీసియం, స్వచ్ఛ్ బయో ఒప్పందాలు-hyderabad arcesium swachh bio agreed to investment in telangana says cm revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Investments : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ- రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్సీసియం, స్వచ్ఛ్ బయో ఒప్పందాలు

Telangana Investments : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ- రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్సీసియం, స్వచ్ఛ్ బయో ఒప్పందాలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 06, 2024 08:34 PM IST

Telangana Investments : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఆర్సీసియం,స్వచ్ఛ్ బయో సంస్థలు ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ
తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

Telangana Investments : టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆర్సీసియం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికాలో పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆర్సీసియం సీఈవో గౌరవ్ సూరి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆర్సీసియం మొదటిసారిగా హైదరాబాద్ లో తమ ఆఫీసును విస్తరించనుంది. అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటిసారి. ప్రపంచ వ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది.

డీఈ షా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో ఆర్సీసియం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది. ప్రత్యేకంగా డేటా మేనేజ్మెంట్, డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. హైదరాబాద్ ఆఫీసు విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్య స్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షించనుంది.

అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో స్పష్టం చేశారు. కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని ప్రకటించారు. ఈ కంపెనీ విస్తరణ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సురెన్స్ రంగంలో హైదరాబాద్ కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబెడుతుందని అన్నారు. సాంకేతిక వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఆర్సీసియం లాంటి కంపెనీలకు తగినంత మద్దతు పాటు మౌలిక సదుపాయాలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని అన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యమున్న మానవ వనరులుండటంతో హైదరాబాద్ ను తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు కంపెనీ సీఈవో గౌరవ్ సూరి తెలిపారు.

రూ.1000 కోట్ల పెట్టుబడులు

సీఎం రేవంత్ రెడ్డి బృందంతో స్వచ్ఛ్ బయో, లిగ్నోసెల్యులోసిక్ బయోఫ్యూయల్స్ తయారీ కంపెనీ ప్రతినిధులు అమెరికాలో భేటీ అయ్యారు. తెలంగాణలో 250 KLPD బయోఫ్యూయల్స్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రణాళికలను ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ స్థిరమైన వృద్ధికి తోడ్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.