Pithapuram Crime : పిఠాపురంలో దారుణ హత్య, తలపై బండరాయితో దాడి!
Pithapuram Crime : పిఠాపురంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డబ్బుల వివాదంలో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు.
Pithapuram Crime : పిఠాపురంలో దారుణ హత్య జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఆ గ్రామంలోని ఎన్.పద్మరాజు, బి. ప్రసాద్‌ల మధ్య గత రాత్రి ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో రోజులాగే గ్రామంలోని దుర్గ గుడి వద్ద నిద్రిస్తున్న బి. ప్రసాద్ (48)ను తలపై బండరాయితో దాడి చేశారు. దీంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్, పద్మరాజు ఇద్దరూ కాకినాడ పనికి వెళ్లేవారు. డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇవ్వకపోతే చంపేస్తానని పద్మరాజును ప్రసాద్ బెదిరించారు. కోపం పెంచుకున్న పద్మరాజు, గ్రామంలోని ఆలయం వద్ద నిద్రిస్తున్న ప్రసాద్‌ను హత్య చేశాడు.
సమాచారం తెలుసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రూరల్ ఎస్సై గుణ శేఖర్, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్.పద్మరాజు, బి. ప్రసాద్‌ల మధ్య ఘర్షణే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అలాగే గ్రామస్థులు కూడా ఈ హత్యకు కారణం పద్మరాజేనని భావిస్తున్నారు.
పేపర్ వ్యాన్ బోల్తాతో ఇద్దరు మృతి
నెల్లూరు జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న కంటైనర్‌ను మినీవ్యాన్ ఢీకొనడంతో ఒకరు, గేదెలను ఢీకొని పేపర్ వ్యాన్ బోల్తా పడడంతో ఇద్దరు మరణించారు. నెల్లూరు నుంచి సీతారామపురం మండలానికి వెళ్తున్న ఓ పేపర్ వ్యాన్‌కు సంగం మండలం దువ్వూఉ వద్ద గేదెలు అడ్డుగా వచ్చాయి. వాటిని ఢీకొట్టడంతో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. వ్యాన్‌లో ఉన్న ప్రమాణికుల్లో నాగరాజు (48) అక్కడిక్కడే మరణించారు. డ్రైవర్ శ్రీనివాసులు (50)ని ఆసుపత్రికి తరలిస్తుండగా మర్గమధ్యలో మృతి చెందారు. నాగరాజుది సంగం మండలం ఎస్‌వీఆర్ పురం గ్రామం కాగా, డ్రైవర్ శ్రీనివాసులది వెంకటేశ్వరపురం గ్రామంగా పోలీసులు గుర్తించారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో జాతీయ రహదారికి అనుకొని ఉన్న చౌదరి పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయాలు పాలయ్యారు. చిత్తూరు నుంచి మామిడి పండ్లు లోడుతో గుంటూరుకు వెళ్తున్న టాటాఏస్ మినీ వ్యాన్, కోవూరు చౌదరి పెట్రోల్ బంకువద్ద రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనక నుంచి డీకొంది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ డ్రైవర్ మొగలి సతీష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాలు పాలైన క్లీనర్‌ను చికిత్స కోసం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. వ్యాన్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృత దేహాన్ని అతికష్టం మీద పోలీసులు బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వం ఆసుపత్రికి 108 వాహనంలో మృత దేహాన్ని తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మొగలి సతీష్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చిత్తూరులో వాకింగ్‌కి వెళ్తుండగా వాహనం ఢీకొని మహిళ మృతి
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలోని శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తుండగా వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. మండలంలోని గంగమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గంగమ్మ గుడి ప్రాంతానికి చెందిన సావిత్రి (65) ఉదయం వాకింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారి గంగమ్మ గుడి మలుపు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సావిత్రి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాజు కుల్లాయప్ప కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు