Nadendla Manohar: ఖరీఫ్ కొనుగోళ్లలో 48 గంటల్లోనే రైతులకు ధాన్యం సేకరణ డబ్బులు చెల్లింపు
Nadendla Manohar: ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఖరీఫ్ నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా సేకరించిన ధాన్యానికి 48గంటల్లోనే మద్దతు ధరలు చెల్లిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గత సీజన్ ధాన్యం సేకరణకు సంబంధించిన మలి విడత నిధులను ఏలూరులో విడుదల చేశారు.
Nadendla Manohar: రైతుల కష్టాలను తీర్చడానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గత ఐదేళ్లలో ఏపీలో రైతులు పడిన కష్టాలు సామాన్యమైనవి కాదన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు బాకీ ఉన్న మొత్తంలో మిగిలిన రూ.674.47కోట్లను ఏలూరులో జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల రైతులకు విడుదల చేశారు.
కౌలు రైతుల్ని ఆదుకోడానికి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో ఐదు కోట్లను పంచిపెట్టారని గుర్తు చేశారు. పశ్చిమగోదావరిలో 45మందికి లక్ష రుపాయల చొప్పున సొంత డబ్బులు పంచిపెట్టారని చెప్పారు. కౌలు రైతుల్ని ఆదుకోవాలని ఆ రోజే తాము నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
ఆర్బీకేలను రైతు సహాయక కేంద్రాలుగా మార్చి రైతాంగాన్ని ఆదుకోడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.నూటికి నూరు శాతం ఈ పంట ద్వారా కౌలు రైతుల్ని ఆదుకుంటామన్నారు. గత నెలలోనే వెయ్యి కోట్లను రైతులకు విడుదల చేశామని తాజాగా విడుదల చేస్తున్న 674 కోట్లలో రూ.47కోట్లను ఏలూరు జిల్లా రైతులకు సంబంధించినవి ఉన్నాయని తెలిపారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35,374మంది రైతులకు నిధులు బకాయి ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 62శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందన్నారు. రైతులకు బాకీ పడిన రూ.1674 కోట్ల నిధుల్లో ఇప్పటికే వెయ్యి కోట్లను విడుదల చేశామని, మిగిలిన రూ.674కోట్లను తాజాగా విడుదల చేస్తున్నట్టు చెప్పారు.
రాబోయే ఖరీఫ్ సీజన్‌లో 48గంటల్లోనే రైతులకు కొనుగోలు చేసిన డబ్బును చెల్లిస్తామని ప్రకటించారు. దాని కోసం ఇప్పటి నుంచి కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. ధాన్యం రవాణాకు అవసరమైన గోతాలు, రవాణా విషయంలో కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదని ఆ సమస్యలు కూడా తాము పరిష్కరిస్తామన్నారు.
రైతులకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి టార్పలిన్లు అందించే ఏర్పాటు చేస్తామన్నారు. తమ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కందిపప్పు ధరను తగ్గించగలిగామని, దేశం మొత్తం రూ.180కు కందిపప్పు అమ్ముతున్నారని, వ్యాపారులు, మిల్లర్లతో సుదీర్ఘంగా చర్చించి హోల్ సేల్ వ్యాపారులు, దేశం మొత్తం ఉన్న వ్యాపారుల్ని ఏపీలో రూ.150కు కందిపప్పు విక్రయించేలా ఒప్పించగలిగామన్ని నాదెండ్ల చెప్పారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేలను కూడా రాజకీయాలకు వాడుకున్నారని ఆరోపించారు. ధాన్యం కావాలంటే ప్రైవేట్ వ్యక్తులతో దందా నడిపారని మండిపడ్డారు.