Ongole Jr NTR Flex : నెక్ట్స్ సీఎం జూ.ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు, ఒంగోలులో హీటెక్కిన రాజకీయం!
Ongole Jr NTR Flex : ఒంగోలులో ఎన్టీఆర్ నెక్ట్స్ సీఎం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. లోకేశ్ ఉద్దేశించి ఈ ఫ్లెక్సీలు పెట్టారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఇదంతా వైసీపీ కుట్ర అని ఆరోపిస్తున్నారు.
Ongole Jr NTR Flex : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. ఈ సమయంలో ఒంగోలులో ఎన్టీఆర్ పేరుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. లోకేశ్ పాదయాత్రకు వస్తున్న ఆదరణతో వైసీపీ నేతలే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ఫ్లెక్సీలు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్ అంటూ ఒంగోలులో ఫ్లెక్సీలు వెలిశాయి. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా కొందరు దురుద్దేశంతో ఈ ఫ్లెక్సీలు పెట్టారని టీడీపీ ఆరోపిస్తున్నారు. 'నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్..అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే' అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ఫ్లెక్సీలు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం దగ్గర, ఫ్లై ఓవర్ కింద, చర్చ్ సెంటర్, కనిగిరి ఇలా పట్టణంలో పలు చోట్ల ఈ ఫ్లెక్సీలు పెట్టారు. దీంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఈ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులనే ఈ ఫ్లెక్సీలు పెట్టారని కొందరు అంటుంటే, వైసీపీ నేతలే కావాలని ఇలా ఫ్లెక్సీలు పెట్టి... పార్టీలో వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కొండేపిలో లోకేశ్ పాదయాత్ర
ప్రస్తుతం కొండేపి నియోజకవర్గంలో నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. లోకేశ్ యువగళం పాదయాత్రకు వస్తోన్న ఆదరణ చూసి తట్టుకోలేక వైసీపీ నేతలే ఇలా ఫ్లెక్సీలు పెట్టి ఉంటాయని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఫ్లెక్సీలు ఎవరు పెట్టారో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. లోకేశ్ పాదయాత్ర నుంచి దృష్టి మరిలించేందుకే కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తు్న్నారు. ఈ ఘటనలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు లోకేశ్ యువగళం పాదయాత్ర 157వ రోజు కొండేపి నియోజకవర్గంలో కొనసాగింది. మాలెపాడు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభిచిన లోకేశ్... మాలెపాడులో పాడిరైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ పనేనని టీడీపీ ఆరోపణలు
పాదయాత్రలో లోకేశ్... వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. స్థానిక వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు అవినీతి పాల్పడుతున్నారని సెల్ఫీలతో ఛాలెంజ్ లు చేస్తు్న్నారు. దీంతో వైసీపీ నేతలు లోకేశ్ కు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర సమయంలో... వైసీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టి లోకేశ్ పై కౌంటర్లు ఇచ్చారు. నెల్లూరులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లోకేశ్ తో కలిసి పాదయాత్రలో పాల్గొనడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి ఒంగోలుకు షిఫ్ట్ అయ్యింది. లోకేశ్ పేరు ప్రస్తావించకుండా ఫ్లెక్సీలు పెట్టి వార్ స్టార్ట్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. పార్టీలో విభేదాల సృష్టించి వాటితో లబ్దిపొందాలని వైసీపీ కుట్ర చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.