Araku Valley : దయచేసి వినండి.. మరికొన్ని రోజులు అరకు రావొద్దు.. అధికారుల కీలక నిర్ణయం
Araku Valley : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటిదాకా కోస్తాంధ్రపై ప్రతాపం చూపిన వర్షాలు.. ఇప్పుడు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకులు అరకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
అరకు వెళ్లాలనుకునే పర్యాటకులకు అల్లూరి జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు తగ్గే వరకు అరకు రావొద్దని సూచించారు. ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గృహలను కూడా మూసివేశారు. ఇప్పటికే చాపరాయి, కటికి జలపాతాలు, పద్మాపురం ఉద్యానవన కేంద్రం, గిరిజన మ్యూజియంలను అధికారులు మూసివేశారు. అరకు ఘాట్ రోడ్డులోనూ రాకపోకలపై ఆంక్షలు విధించారు.
అటు సీలేరు జలాశయంలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. డొంకరాయి, ఫోర్ బే డ్యామ్‌ల పదిహేను గేట్లు ఎత్తి లక్షా పదివేల క్యూసెక్కుల నీరును విడుదల చేస్తున్నారు. సీలేరు వరద నీటితో శబరి నదిలో నీటి మట్టం పెరుగుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కొండపై నుంచి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆదివాసుల గృహాలు కొన్ని ధ్వంసం అయ్యాయి. నలుగురు గిరిజనులు గాయపడ్డారు. ఒక బాలిక వరద ప్రవాహంలో గల్లంతయినట్టు తెలుస్తోంది.
అల్లూరి జిల్లాలోని కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం దాల్చింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో ఈ జలపాతానికి వరద పోటెత్తింది. దీంతో పర్యాటకులు, సందర్శనకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, రామవరం మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
భారీ వర్షాలు, వరదల కారణంగా అల్లూరి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో జీకి వీధి మండలం దారకొండ మారుమూల గ్రామాల్లో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వారికి వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది వాగులు దాటి వెళ్తున్నారు. వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నా.. వైద్య సిబ్బంది వెనకడుగు వేయడం లేదు.