Happy Daughters Day 2024 : ఆడపిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా, డాటర్స్ డే సందర్భంగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గిఫ్ట్ లు ఇవే
Happy Daughters Day 2024 : ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని భావిస్తారు. డాటర్స్ డే సందర్భంగా తల్లిదండ్రులు ఇలాంటి పెట్టుబడి గిఫ్ట్ లను అందిస్తే వారికి జీవితాంతం ఆర్థిక స్వతంత్ర్యం లభిస్తుంది. ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగపడే ఆరు పెట్టుబడి స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.
Happy Daughters Day 2024 : సెప్టెంబర్ 22న 'నేషనల్ డాటర్స్ డే' గా జరుపుకుంటున్నాం. సెప్టెంబర్ చివరి ఆదివారాన్ని ఏటా డాటర్స్ డే గా నిర్వహించుకుంటాం. ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని పెద్దలు అంటుంటారు. ఆడబిడ్డల భవిష్యత్ భరోసా అందించేందుకు వారికోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంది. ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే ఆడపిల్లలకు ఆర్థిక స్వతంత్ర్యం కల్పించవచ్చు. డాటర్స్ డే సందర్భంగా మీ ఆడబిడ్డలకు ప్రత్యేక గిఫ్ట్ గా ఈ పథకాల్లో వారి పేరుతో పెట్టుబడి పెట్టండి. వారి భవిష్యత్ కు, చదువులకు , వివాహానికి ఆర్థిక భరోసా కల్పించండి. మీ ఆడపిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఈ 6 పెట్టుబడి ప్రణాళికలు ఎంతగానో ఉపయోగపడతాయి.
1.సుకన్య సమృద్ధి యోజన :
సుకన్య సమృద్ధి యోజన పథకం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ప్రారంభించిన పొదుపు కార్యక్రమం. ఇది ఆడపిల్లల విద్య, వివాహ ఖర్చులను కవర్ చేయడానికి ఉద్దేశించినది. ఈ పథకాన్ని జనవరి 22, 2015న కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తల్లిదండ్రులు సంవత్సరానికి కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1,50,000 వరకు పొదుపు చేసుకోవచ్చు. పోస్టాఫీసులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పెట్టుబడులపై 8.2 శాతం వడ్డీ అందిస్తోంది. బాలికల పేరుతో తల్లిదండ్రులు, సంరక్షకుడు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఈ పథకానికి అర్హులు.
2. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్థిర ఆదాయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడి పథకం. దీనిని ప్రధానంగా తక్కువ, మధ్య ఆదాయాల వారిని లక్ష్యంగా చేసుకుని అమలు చేస్తున్నారు. ఈ పెట్టుబడిపై పన్ను ఆదాకు అవకాశం కల్పిస్తున్నారు. నేషన్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా మైనర్ తరపున పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసులో ఈ పథకం అమల్లో ఉంది. పెట్టుబడి పెట్టిన ఐదు సంవత్సరాల వ్యవధిలో మెచ్యూర్ అవుతుంది. కనిష్టంగా రూ.100, గరిష్టంగా ఎంతో పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్ఎస్సీపై ప్రస్తుతం 7.7 శాతం వడ్డీ అందిస్తున్నారు.
3. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIPS)
యులిప్‌లు తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులకు అద్భుతమైన పెట్టుబడి మార్గం. పెట్టుబడి అవకాశాలతో పాటు బీమా కవరేజీని కలిపి అందిస్తారు. యులిప్ లు మీ పిల్లల భవిష్యత్తు కోసం, వారికి ఆర్థిక భరోసా అందించేందుకు తోడ్పడతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని, యులిప్‌లలో పెట్టుబడి పెడితే మీ పిల్లల చదువుకు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే ఈ పెట్టుబడులకు మార్కెట్ రిస్క్ ఉంటుంది.
4. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ దీర్ఘకాలిక పొదుపు, ఆర్థిక నిర్వహణను ప్రోత్సహిస్తుంది. మీ ఆడపిల్లల ఆర్థిక స్థిరత్వాన్ని ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పోస్టల్ సేవింగ్స్ స్కీమ్ మరొక ప్రయోజనం పోర్టబిలిటీ. ఈ పథకాన్ని దేశంలో ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు, బదిలీ చేసుకోవచ్చు.
5. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
పీపీఎఫ్ స్కీమ్ ఆకర్షణీయమైన రాబడి అందించే పెట్టుబడి మార్గం. చిన్న పొదుపులను ప్రోత్సహించడం పీపీఎఫ్ పథకం ముఖ్య లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం అందించిన హామీ మేరకు పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడులు సురక్షితం. మైనర్ల పేరుతో తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ పథకాన్ని నిర్వహిస్తారు. కనిష్టంగా రూ.500 గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. పీపీఎఫ్ ప్రస్తుత వడ్డీ రేటు రూ.7.1 శాతం.
6. చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్
చిల్డ్రన్స్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది పిల్లల ఆర్థిక అవసరాలకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్ రకం. పిల్లల చదువులు, వివాహం, ఇతర ఆర్థిక అవసరాల దృష్ట్యా ఇది మంచి పెట్టుబడి పథకం. అయితే ఈ పథకానికి మార్కెట్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
Disclaimer : ఈ ఆర్టికల్ లోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ఆధారిత సమాచారంతో రాశాం. పెట్టుబడి అంశాలపై నిపుణుల సలహాలు తప్పనిసరి.
సంబంధిత కథనం