FD rates comparison: ఏ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేటు ఎంత?
FD rates comparison: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. వాటిలో ఏవి మేలో ఒకసారి పోల్చి చూడండి.
FD rates comparison: బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మే 2022 నుంచి తరచుగా పెంచుతూ వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు పెంచిన ప్రతి సందర్భంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తమ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా సెప్టెంబరు 30న రిజర్వ్ బ్యాంక్ మరోసారి రెపో రేటు పెంచడంతో పలు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఒకసారి పోల్చిచూద్దాం.
SBI latest FD rates: ఎస్‌బీఐ తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే
ఎస్‌బీఐ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును 20 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. ప్రస్తుతం ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య గల కాలానికి వేర్వేరు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 5.85 శాతం వరకు వడ్డీ రేటు వర్తింపజేస్తోంది. ఇక సీనియర్ సిటిజెన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీరేట్లను 3.50 శాతం నుంచి 6.65 శాతంగా వర్తింపజేస్తుంది. కొత్త రేట్లు అక్టోబరు 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
HDFC Bank latest FD rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూరిటీ వచ్చే వేర్వేరు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలకు 3 శాతం నుంచి 6 శాతం మధ్య, సీనియర్ సిటిజన్లకైతే 3.50 శాతం నుంచి 6.75 శాతం మధ్య వడ్డీ చెల్లిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ కొత్త వడ్డీ రేట్లు అక్టోబరు 11 నుంచి అమల్లోకి వచ్చాయి.
ICICI Bank latest FD rates: ఐసీఐసీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇలా..
ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. ఏడు రోజుల నుంచి పదేళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై 3 శాతం నుంచి 6.20 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లయితే 3.50 శాతం నుంచి 6.75 శాతం మధ్య వడ్డీ లభిస్తుంది. సవరించిన వడ్డీ రేట్లు అక్టోబరు 18, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి.
Axis Bank latest FD rates: యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇలా..
యాక్సిస్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై ఏడు నుంచి పదేళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే వాటికి 3.50 శాతం నుంచి 6.10 శాతం వరకు వడ్డీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకైతే 3.50 శాతం నుంచి 6.85 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంది. పెరిగిన వడ్డీ రేట్లు అక్టోబరు 14 నుంచి అమల్లోకి వచ్చాయి.
ప్రాచుర్యం పొందిన కొన్ని బ్యాంకుల్లో అమలవుతున్న వడ్డీ రేట్లు మాత్రమే ఇక్కడ పొందుపరిచినట్టు గమనించగలరు.