Nara Lokesh Padayatra : లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా
Nara Lokesh Yuvagalam Padayatra : నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా పడింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రకటన విడుదల చేసింది.
Nara Lokesh Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తేదీ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టుక సంబంధించి అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు లోకేశ్‌ని కోరారు. దీంతో రేపట్నుంచి పునఃప్రారంభం కావాల్సిన పాదయాత్రను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో కోరారు.
స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న నారా లోకేశ్ రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేశారు. ఆ రోజు నుంచి చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. రాజమండ్రిలో జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబును పలుమార్లు కలిసిన లోకేశ్… ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. పలు పార్టీల ప్రతినిధులను కలిసే ప్రయత్నం చేశారు. ఇటీవలే చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లారు. అయితే దాదాపు 20 రోజుల తర్వాత సెప్టెంబరు 29న రాత్రి 8.15 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు లోకేశ్. ఈ క్రమంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని అంతా భావించినప్పటికీ…. గురువారం పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 3న స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.
మరోవైపు చంద్రబాబు పిటిషన్ సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉండగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు ఇచ్చే ముందు తమ తరపు వాదనలు కూడా వినాలని పిటిషన్ లో ప్రస్తావించింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయని తెలిపింది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారని… నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్ చేసుకున్నారని పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయని… ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీనే అని చెప్పింది. ఈ కేసులో తమ తరపున వాదనలను వినిపిస్తామని కేవియట్ పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే ఈ బెంచ్‌లో తెలుగు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి కేసు విచారణకు విముఖత వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా సీజేఐ ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు. మరో ధర్మాసనం లేదా సీజేఐ ధర్మాసనం విచారించాలని ఆయన కోరడంతో... ఈ పిటిషన్ పై విచారణకు సీజేఐ అంగీకరించారు. విచారణను మరో బెంచ్‌కు బదిలీ చేస్తామని సీజేఐ తెలిపారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేశారు.