Nandyal Accident : నాలుగు నెలల క్రితమే వివాహం, ఇంతలోనే విషాదం- భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త మృతి
Nandyal Accident : రైలు ఫుట్ బోర్డు ప్రయాణం ఓ కొత్త జంటకు విషాదం మిగిల్చింది. నిద్ర మత్తులో రైలు నుంచి పడిపోయిన భార్యను రక్షించేందుకు భర్త దూకేశాడు. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
Nandyal Accident : భార్యను కాపాడే ప్రయత్నంలో రైలు కింద పడి భర్త మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో గుంటూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆ కుటుంబం. శనివారం తెల్లవారు జామున నిద్రమత్తులో భార్య రైలు నుంచి పడిపోవడాన్ని గ్రహించిన భర్త, భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త రైలు కింద పడి మరణించాడు. దీంతో నాలుగు నెలల క్రితమే వివాహం వీరి జీవితం ఆదిలోని ఆగిపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.
ఈ ఘటన రాష్ట్రలోని నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి సమీపంలో ఎర్రగుంట్ల వద్ద చోటు చేసుకుంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసిఫ్, అసియాబాకు నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు గుంటూరు ఏదో పని మీద వచ్చారు. తిరిగి కర్ణాటక వెళ్లిపోవడానికి గుంటూరులో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును శుక్రవారం రాత్రి 8.30-9.00 గంటల మధ్యలో ఎక్కారు. ఆ రైలులో పుట్ బోర్డుపై సయ్యద్ ఆసిఫ్, అసియాబా దంపతులిద్దరూ కూర్చొని ప్రయాణిస్తున్నారు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి సమీపంలో ఎర్రగుంట్ల వద్దకు రైలు శనివారం తెల్లవారు జామున 3.30 - 4.00 గంటల మధ్య చేరుకుంది. ఈ సమయంలో భార్య అసియాబా నిద్ర మత్తులో ఉంది. దీంతో పుట్‌పాత్ పై నుంచి కిందకు పడింది. దీన్ని గమనించిన భర్త సయ్యద్ ఆసిఫ్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. అందుకు రైలు నుంచి దూకి, రైలు కింద పడిపోయాడు. వెంటనే అక్కడికక్కడే సయ్యద్ మరణించాడు. భార్య అసియాబాకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సయ్యద్ ఆసిఫ్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గేదెను తప్పించబోయి చెట్టుకు కారు ఢీకొని వ్యక్తి మృతి
సత్యసాయి జిల్లాలో గేదెను తప్పించబోయి చెట్టుకు కారు ఢీకొని వ్యక్తి మరణించాడు. భార్య, కుమార్తెకు తవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. శనివారం శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం యర్రగుంటపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా ఉప్పరపల్లికి చెందిన చంద్రమౌళి రెడ్డి, కరుణ శ్రీ దంపతులు ఉన్నారు. కుమార్తె భవ్యశ్రీని కాలేజీలో చేర్పించడానికి చంద్రమౌళి రెడ్డి, కరుణ శ్రీ దంపతులు కారులో బయలుదేరారు. ముగ్గురు వెళ్తున్న సందర్భంలో యర్రగుంటపల్లీ వద్ద కారుకు గేదె అడ్డుగా వచ్చింది. గేదెను తప్పించబోయి కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొంది.
ఈ ప్రమాదంలో చంద్రమౌళి రెడ్డి అక్కడికక్కడే మరణించగా, ఆయన భార్య కరుణశ్రీ, కుమార్తె భవ్యశ్రీకి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రగాయాలు పాలైన తల్లి, కుతురిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం