Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం, మహిళతో అసభ్య ప్రవర్తన, రైలు నుంచి పడిపోయిన వివాహిత-misbehavior in visakha express married woman who fell from the train ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం, మహిళతో అసభ్య ప్రవర్తన, రైలు నుంచి పడిపోయిన వివాహిత

Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం, మహిళతో అసభ్య ప్రవర్తన, రైలు నుంచి పడిపోయిన వివాహిత

Sarath chandra.B HT Telugu
Jul 10, 2024 06:11 AM IST

Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. రైలు రిజర్వేషన్ బోగీలో వాష్‌ రూమ్‌ నుంచి వస్తున్న యువతితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో ఇద్దరు రైలు నుంచి కిందపడ్డారు.

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో యువతిపై లైంగిక దాడికి యత్నం
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో యువతిపై లైంగిక దాడికి యత్నం

Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహితపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో రైలు నుంచి పడి యువతికి గాయాలయ్యాయి. గాయాలతో పట్టాలపై నడుచుకుంటూ వచ్చిన యువతని చూసి సమీప గ్రామస్తులు అప్రమత్తమై పోలీసులకు సమాచరం ఇచ్చారు.

yearly horoscope entry point

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం రాత్రి 7గంటలకు మిర్యాలగూడ స్టేషన్‌కు చేరుకుంది.

రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే రైలు వేగం తగ్గింది. ఆ ఎస్‌-2 బోగీలో ప్రయాణిస్తున్న ఓ మహిళ వాష్‌రూమ్‌ నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా డోర్‌ వద్ద మద్యం మత్తులో ఉన్న ఒడిశాకు చెందిన బిశ్వాస్‌.. ఆమె నడుము పట్టుకుని కిందకు లాగాడు. ఈ ఘటనలో ప్రయాణికురాలు రైలు నుంచి కిందపడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బిశ్వాస్‌ కూడా రైలు నుంచి కింద పడిపోయాడు.

గాయపడిన బాధితురాలు సమీపంలోని వాటర్‌ ట్యాంక్ తండా వరకు నడుచుకుంటూ వెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. ఆమె పరిస్థితి గమనించిన గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్ర నాయక్ దుస్తులు మార్పించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు రైల్వే పోలీసులతో కలిపి తనిఖీలు చేపట్టారు.

రైల్వే ఎస్‌ఐ పవన్‌ కుమార్‌రెడ్డి గ్రామానికి చేరుకొని మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. రైలు పట్టాలపై కొంత దూరంలో మద్యం మత్తులో పడి ఉన్న బిశ్వాస్‌ను మరో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో గాయపడిన యువతి భర్తతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్టు సమాచారం. శ్రీకాకుళంలోని సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్‌-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు.యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తిని ఒడిశాకు చెందిన బిశ్వాస్‌గా గుర్తించారు. ఈ ఘటనలో అతను కూడా గాయపడటంతో చికిత్స చేయిస్తున్నారు. తాజా ఘటనతో రైళ్లలో మహిళల భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి. రిజర్వుడు బోగీల్లో సాయుధ బలగాల తనిఖీలు ఉండే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడంపై ఆర్పీఎఫ్‌, జిఆర్పీ పనితీరుకు అద్దం పడుతోంది.

Whats_app_banner