Konaseema Crime: కోనసీమ జిల్లాలో ఘోరం, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బాలికపై అత్యాచారం
Konaseema Crime: బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. బాలికను ప్రేమించి, పెళ్లి చేసకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు యువకుడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
Konaseema Crime: పెళ్లి చేసుకుంటానంటూ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడిపై కోనసీమ జిల్లాలో పోక్సో, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ ఘటన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. పి.గన్నవరం ఎస్ఐ బి.శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం పి.గన్నవరం మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలికను మానేపల్లికి చెందిన ఎస్‌కే అజామ్ మూడేళ్ల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో బాలిక కూడా అజామ్ మాయ మాటలను నమ్మేసింది. దీంతో పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే బాలిక పెళ్లి ప్రస్తావన తెచ్చే సరికి ఏదో ఒకటి చెప్పేవారు. చివరకు పెళ్లి చేసుకోడానికి నిరాకరించాడు.
దీనిపై యువకుడి తల్లిండ్రులను బాలిక కుటుంబ సభ్యులు ప్రశ్నించగా కులం పేరుతో దూషించి, చంపుతామని బెదిరించారు. దీంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరుకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.శివకృష్ణ తెలిపారు. అలాగే బాలిక కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించినందుకు గానూ యువకుడి తల్లిదండ్రులపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును కొత్తపేట డీఎస్పీ గోవిందరావు దర్యాప్తు చేస్తున్నారని ఎస్ఐ శివకృష్ణ పేర్కొన్నారు.
వాట్సప్‌లో విద్యార్థినికి ఉపాధ్యాయులు అసభ్యకర పోస్టులు…
చిత్తూరు జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.
ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని దాసేగౌనూరు జెడ్పీ హైస్కూల్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థినితో అదే పాఠశాల ఉపాధ్యాయుడు గతేడాది ఏప్రిల్‌లో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అప్పట్లోనే గ్రామస్థులు ఆ ఉపాధ్యాయుడిని మందలించి వదిలేశారు. అయితే ఉపాధ్యాయుడి తీరు మారకపోవడంతో బాధిత తల్లిదండ్రులు బాలికను అక్కడ మాన్పించి ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు.
తాజాగా ప్రస్తుతం డిప్యూటేషన్‌పై కుప్పంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఆ ఉపాధ్యాయుడు రెండు రోజుల క్రితం మళ్లీ ఆ విద్యార్థినికి వాట్సప్‌లో అసభ్యకర పోస్టులు పెట్టాడు. ఆగ్రహించిన బంధువులు, గ్రామస్థులు మంగళవారం ఆ పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. డీవైఈవో చంద్రశేఖర్ స్పందిస్తూ విషయం తమ దృష్టికి వచ్చిందని, విచారించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)