Fake Hall Ticket : కుటుంబాల మధ్య గొడవతో గ్రూప్-2 ఫేక్ హాల్ టికెట్ క్రియేట్ , తమ్ముడిని ఇరికించాలని అన్న కుట్ర!-kurnool crime news in telugu group 2 fake hall ticket incident police arrested one family issues reasons ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Fake Hall Ticket : కుటుంబాల మధ్య గొడవతో గ్రూప్-2 ఫేక్ హాల్ టికెట్ క్రియేట్ , తమ్ముడిని ఇరికించాలని అన్న కుట్ర!

Fake Hall Ticket : కుటుంబాల మధ్య గొడవతో గ్రూప్-2 ఫేక్ హాల్ టికెట్ క్రియేట్ , తమ్ముడిని ఇరికించాలని అన్న కుట్ర!

Bandaru Satyaprasad HT Telugu
Feb 28, 2024 03:10 PM IST

Fake Hall Ticket : చిత్తూరు జిల్లాలో గ్రూప్-2 ఫేక్ హాల్ టికెట్ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలతో వరసకు తమ్ముడైన వ్యక్తిని పరీక్ష రాయనీయకుండా చేసేందుకు అన్న ఫేక్ హాల్ టికెట్ రూపొందించాడని పోలీసులు తెలిపారు.

గ్రూప్-2 ఫేక్ హాల్ టికెట్  వ్యవహారం
గ్రూప్-2 ఫేక్ హాల్ టికెట్ వ్యవహారం

Fake Hall Ticket : ఏపీపీఎస్సీ ఇటీవల గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష (APPSC Group 2)నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పరీక్ష జరిగిందని, ఒకచోట ఫేక్ హాల్ టికెట్ తో వ్యక్తి హాజరయ్యారని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ ఫేక్ హాల్ టికెట్ (Group 2 Fake Hall Ticket)వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేశారు. రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు ఫేక్ హాల్ టికెట్ క్రియేట్ చేసేందుకు కారణమయ్యాయని పోలీసులు నిర్థారించారు. గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ కు చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి నకిలీ హాల్ టికెట్ తో హాజరయ్యాడు. అసలు పరీక్షే లేని కేంద్రానికి హాల్ టికెట్ తో రావడంతో... పోలీసులు విచారించారు. వ్యక్తిగత కక్షలతో నకిలీ హాల్ టికెట్ రూపొందించారని పోలీసులు తెలిపారు. ఇమ్మానియేల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి నుంచి కంప్యూటర్ తోపాటు ఒక సెల్ ఫోన్ ను సీజ్ చేశారు.

తమ్ముడిని మోసం చేసేందుకు ప్లాన్ వేసి

వరసకు తమ్ముడైన వ్యక్తిని మోసం చేసే ప్రయత్నంలో అన్న చిక్కుల్లో పడ్డాడు. కర్నూలు(Kurnool) జిల్లా క్రిష్ణగిరి మండలం కంబాలపాడుకు చెందిన సుదర్శనం...గ్రూప్-2 పరీక్షకు అప్లై చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం డోన్ లో మీ-సేవ కేంద్రంలో పనిచేస్తున్న తన బంధువైన ఇమ్మానుయేల్ ను సంప్రదించాడు. తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలతో సుదర్శనంను పరీక్ష రాయనీయకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇమ్మానుయేల్ నకిలీ హాల్ టికెట్‌ క్రియేట్ చేసి పోలీసులకు పట్టుబడేలా పథకం వేశాడు. చిత్తూరులో పరీక్షకు హాజరయ్యేలా ఫేక్ హాల్ టికెట్ క్రియేట్ చేశాడు. నకిలీ హాల్ టికెట్ తో సుదర్శనం పరీక్ష రాసేందుకు చిత్తూరు జిల్లాకు వెళ్లాడు. అయితే ఆ హాల్ టికెట్ ఫేక్ అని తేలడంతో సుదర్శనం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది.

"సుదర్శనం కుటుంబంతో ఉన్న గొడవల కారణంగా ఇమ్మాన్యుయేల్ ఉద్దేశపూర్వకంగా గ్రూప్-2 పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయలేదు. ఇందుకు బదులుగా అతను మీ సేవా కేంద్రంలోని ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న మండల శ్రీనివాసులు అనే వ్యక్తి ఒరిజినల్ హాల్ టికెట్‌లో మార్పులు చేశాడు. ఆ హాల్ టికెట్ పై పేరు, ఫొటో, ఇతర వివరాలను సుదర్శనంతో భర్తీ చేశాడు"-ఏఎస్పీ, చిత్తూరు

నకిలీ హాల్ టికెట్‌లో చిత్తూరులోని నారాయణ కళాశాలను పరీక్షా కేంద్రంగా చూపడంతో... సుదర్శనం డోన్ నుంచి చిత్తూరు వరకు వెళ్లాడు. చివరికి అక్కడి పరీక్ష కేంద్రం లేదని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. చివరికి అతను తన సొంత బంధువు చేతిలోనే మోసపోయానని తెలుసుకున్నాడు. సుదర్శనం ఫిర్యాదుతో చిత్తూరు పట్టణ పోలీసులు ఫోర్జరీ, మోసం, నమ్మక ద్రోహం కింద ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద ఇమ్మానుయేల్ పై కేసు నమోదు చేశారు. నేరానికి ఇమ్మాన్యుయేల్ ఉపయోగించిన కంప్యూటర్, మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Whats_app_banner