YSRCP : వద్దన్నా.. ప్లీజ్ వెళ్లకండి.. జగన్ నుంచి ఈ మాటలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా?-key leaders are resigning from ysrcp but jagan is not saying no ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp : వద్దన్నా.. ప్లీజ్ వెళ్లకండి.. జగన్ నుంచి ఈ మాటలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా?

YSRCP : వద్దన్నా.. ప్లీజ్ వెళ్లకండి.. జగన్ నుంచి ఈ మాటలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా?

Basani Shiva Kumar HT Telugu
Sep 13, 2024 05:30 AM IST

YSRCP : ఎన్నికల ముందు నాయకులు పార్టీలు మారుతుంటారు. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. ఎన్నికల తర్వాత కూడా పార్టీలు మారుతుంటారు. వాళ్లకీ ఏవో ఇబ్బందులు ఉంటాయి. అయితే.. పార్టీలు మారే నేతలను అధినేతలు వద్దని వారిస్తుంటారు. కానీ.. జగన్ మాత్రం ఆ పని చేయడం లేదు.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ పని ఇక అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో.. పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాజకీయ అవసరాల కోసం పార్టీలు మారే నేతలు వెళ్లినా ఫర్వాలేదు. కానీ.. జగన్‌ను నమ్మి.. నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు. అయితే.. వారిని జగన్ వద్దని వారించినట్టు మాత్రం కనిపించడం లేదు.

జగన్ స్టైలే వేరు..

రాజకీయాల్లో జగన్ స్టైలు వేరు. పెద్ద పెద్ద నేతలు పార్టీని స్థాపించి అధికారం చేపట్టారు. అలాంటి నేతలు కూడా తమ పార్టీ వారు వేరే పార్టీలోకి వెళ్తుంటే దూతలను పంపి బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. కానీ.. జగన్ మాత్రం అలా కాదు. వెళ్లే వారిని వెళ్లనివ్వండి.. నో ప్రాబ్లం అని లైట్ తీసుకుంటున్నారు. అందుకు ఇటీవల జగిరిన ఘటనలే ఉదాహరణ. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో నడిచిన వారు పార్టీకి రాజీనామా చేస్తున్నా.. జగన్ కేర్ చేయడం లేదు.

అధికారంలో ఉన్నా.. లేకపోయినా..

2019లో జగన్ 151 మంది ఎమ్మెల్యేల బలంతో అధికారం చేపట్టారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఎన్నికలు ఇంకో ఏడాది ఉందనగా.. జంపింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు కూడా వేరే పార్టీల్లోకి వెళ్లేవారిని జగన్ ఆపలేదు. 'ఇష్టం ఉంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపొండి' అని ఖరాఖండిగా చెప్పేశారు. ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు అందుకు ఉదాహరణ. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు కూడా జగన్ ఇదే వైఖరితో ఉన్నారు.

జగన్ నమ్మకం.. ధైర్యం అదే..

లీడర్లు పోయినా పరవాలేదు.. క్యాడర్ తన వెంటే ఉందని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఏ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా.. తనను చూసే ప్రజలు ఓట్లు వేస్తారని జగన్ భావిస్తారు. అందుకే ఎంత పేరున్న నేతలు పార్టీని వీడినా.. అక్కడ ఇంకో లీడర్‌ను తయారుచేస్తానని జగన్ చెబుతుంటారు. అందుకే పార్టీని వీడుతున్న వారిని జగన్ ఆపబోరని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. జగన్ ధైర్యం.. జగన్ నమ్మకం క్యాడర్, ప్రజలేనని.. నాయకులు కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

చంద్రబాబుకు.. జగన్‌కు అదే తేడా..

రాజకీయాల్లో చంద్రబాబుకు, జగన్‌కు చాలా తేడా ఉంది. ముఖ్యంగా నేతలు పార్టీని వీడే సమయంలో ఇద్దరి వైఖరి వేరేలా ఉంటుంది. ఎన్నికల ముందు విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. అప్పుడు వెంటనే స్పందించిన చంద్రబాబు.. రాష్ట్రస్థాయి నేతలను కేశినేని నాని వద్దకు పంపి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ.. జగన్ మాత్రం ఆ పని చేయడం లేదు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ వంటివాళ్లు పార్టీని వీడతారని ప్రచారం జరిగినా జగన్ పెద్దగా పట్టించుకోలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

తాజాగా.. జగన్ బంధువు, పార్టీలో కీలకంగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీని వీడటానికి సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాలో ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాంటి నేత బయటకు వెళ్తారని తెలిసినా జగన్ కనీసం బుజ్జగించే ప్రయత్నం చేయలేదని సమాచారం. 'వెళ్లాలనే ఉద్దేశం ఉన్నవారు ఎప్పుడైనా వెళ్తారు.. నాకు నాతో ఉండేవారు మాత్రనే కావాలి. నాతో ఉండాలనుకునే వారు ఎప్పుడూ నాతోనే ఉంటారు' అని జగన్ పార్టీ నేతలతో చెప్పినట్టు తెలిసింది.

ఆ మాటలు జగన్ నుంచి వస్తాయా..

పార్టీ నుంచి ఎంత మంది నేతలు వెళ్లినా.. వెళ్తున్నా.. జగన్ నుంచి కొన్ని మాటలు ఎక్స్‌పెక్ట్ చేయలేమని వైసీపీ నేతలు చెబుతున్నారు. 'వద్దన్నా.. ప్లీజ్.. వెళ్లకండి' వంటి మాటలు జగన్ డిక్షనరీలో లేవని వైసీపీ క్యాడర్ అంటోంది. ఇప్పుడు వెళ్లిన నేతలు మళ్లీ ఎన్నికల సమయానికి తమ పార్టీలోకే వస్తారని వైసీపీ క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాంటి వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దని కార్యకర్తలు జగన్‌ను కోరుతున్నారు.

Whats_app_banner