YSRCP : వైసీపీకి మరో షాక్.. గుడ్‌బై చెప్పనున్న బాలినేని శ్రీనివాస్.. జనసేనలో చేరే ఛాన్స్!
YSRCP : 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. జగన్ ఎంతో ప్రాధాన్యమిచ్చిన కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఆళ్ల నాని, మోపిదేవి వంటి వారు పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే మరో కీలక నేత పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది.
వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. ఇన్నాళ్లు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులకు తెలిపినట్టు సమాచారం. గత మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కకపోవడంతో.. బాలినేని కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఎన్నికలకు ముందు కూడా ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ.. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేశారు.
జగన్ నుంచి పిలుపు..
బుధవారం సాయంత్రం జగన్ నుంచి బాలినేనికి పిలుపు వచ్చింది. జగన్‌ను కలిసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. తాను పార్టీలో ఉండలేనని చెప్పినట్టు సమాచారం. దీంతో జగన్‌తో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్టు తెలిసింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్‌కు బంధువు. వైవీ సుబ్బారెడ్డికి స్వయాన బావ అవుతారు. ఆయన వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించారు.
పవన్‌తో సన్నిహిత సంబంధాలు..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌తోనూ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. బాలినేని శ్రీనివాస్.. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయలేదు. కొన్ని సందర్భాల్లో పవన్‌కు సపోర్ట్‌గా నిలిచారనే టాక్ కూడా ఉంది. అటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌తో బాలినేనికి రాజకీయ వైరం ఉంది. దీంతో బాలినేని జనసేనలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఆ స్వేచ్ఛ ఉంది..
అయితే.. పార్టీపై ఒత్తడి చేసేందుకే బాలినేని రాజీనామా డ్రామా చేస్తున్నారని.. ఆయన వ్యతిరేకులు చెబుతున్నారు. వైసీపీలో బాలినేనికి స్వేచ్ఛ ఉందని.. ఏ విషయాన్నైనా నేరుగా జగన్‌తో మాట్లాడే చనువు బాలినేనికి ఉంటుందని అంటున్నారు. అలాంటి నేత ఎందుకు రాజీనామా చేస్తారనే ప్రశ్నిస్తున్నారు. కానీ.. బాలినేని అనుచరులు మాత్రం రాజీనామా ఖాయం అని స్పష్టం చేస్తున్నారు.
కారణం ఇదే..
2019లో జగన్ అధికారంలోకి వచ్చాక.. తొలి మంత్రివర్గంలో బాలినేనికి చోటు దక్కింది. విద్యుత్, అటవీ శాఖ మంత్రిగా ఆయన రెండున్నరేళ్లు పని చేశారు. ఆ తర్వాత మంత్రి వర్గంలో మార్పులు జరిగాయి. అప్పుడు బాలినేనికి అవకాశం దక్కలేదు. అటు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వాళ్లను జగన్ మంత్రి వర్గంలో కొనసాగించారు. దీంతో బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి మళ్లీ అవకాశం ఇచ్చి.. తనకు ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
పరిచయం అక్కర్లేని నేత..
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆయన తన అనుచరులను ఎమ్మెల్యేగా గెలిపించుకునే సత్తా ఉన్న నేత. అటు 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాలినేని చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదనే అసంతృప్తి కూడా ఉంది. తాను కాకుండా వేరే వాళ్లు చెప్పిన వారికి టికెట్ ఇవ్వడంతో బాలినేని బహిరంగంగానే అంసతృప్తి వ్యక్తం చేశారు. అటు జిల్లాకు చెందిన ఓ మాజీమంత్రి తోనూ బాలినేనికి పొసగడం లేదని సమాచారం. ఇవన్నీ కారణాలతో ఆయన పార్టీ మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది.