Jog Water Falls : పరవళ్లు తొక్కుతున్న జోగ్ జలపాతం, ఆ అద్భుతాన్ని ఓసారి చూసొద్దామా?
Jog Water Falls : వర్షాలు ప్రారంభం కావడంతో జోగ్ జలపాతం కనువిందు చేస్తుంది. దేశంలోనే ఎత్తైన జలపాతాల్లో ఒకటైన జోగ్ జలపాతాన్ని, సుందరమైన ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఇదే సరైన సమయం. జోగ్ జలపాతానికి ఎలా చేరుకోవాలి, స్టే, సమీపంలో సందర్శనీయ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
Jog Water Falls : వర్షాకాలం ప్రారంభం అయ్యింది. కర్ణాటకలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోనే ఎత్తైన జలపాతాల్లో ఒకటైన జోగ్ ఫాల్స్ ఎంతో సుందరంగా మారింది. జోగ్ జలపాతం కర్ణాటకలో ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇది కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉంది. దీనిని గెరుసొప్పే జలపాతం, గెర్సొప్ప జలపాతం, జోగడ గుండి అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో ఇది ఒకటి. వర్షాకాలంలో జోగ్ జలపాతం దృశ్యాలు ఎంతో సుందరంగా ఉంటాయి. భారతదేశంలోని ప్రకృతి అద్భుతమైన కళాఖండాలలో జోగ్ ఫాల్స్ ఒకటి. దట్టమైన అడవులలో ఈ జలపాతం ఉంది. ఇక్కడి అద్భుతమైన జలపాతాల దృశ్యాలు, చాలా ఎత్తు నుంచి నీళ్లు పడుతున్న దృశ్యాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనిపించేలా ఉంటాయి.
టూరిస్టులు జోగ్ వాటర్ ఫాల్స్ వీక్షించేందుకు రెండు ఓపెన్ వ్యూయింగ్ డెక్‌లు ఉన్నాయి. ఒకటి మెయిన్ గేటు పార్కింగ్ ప్రాంతానికి సమీపంలో ఉంది, మరొకటి చెకింగ్ రూమ్ కు సమీపంలో ఉంది. వర్షాకాలంలో పర్యాటకులు 1400 మెట్లు ఎక్కి జలపాతం పడే కొండలపైకి ప్రకృతి అందాలు, ఆ ధ్వనిని వీక్షించవచ్చు. శరావతి అడ్వెంచర్ క్యాంప్‌లో అడవిలో ట్రెక్కింగ్, వివిధ రకాల వలస పక్షులను చూడటం, కయాకింగ్, కొరాకిల్ రైడ్ టూరిస్టుల కోసం మరెన్నో వంటి కార్యకలాపాలను అందుబాటులో ఉన్నాయి. జంగిల్ లాడ్జెస్, రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి.
జోగ్ జలపాతాన్ని సందర్శించడానికి జూన్ - డిసెంబర్ మధ్య ఉత్తమ సమయం. అయితే ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో జోగ్ జలపాతం సందడి చేస్తుంది.
జోగ్ జలపాతాన్ని ఎలా చేరుకోవాలి
- విమానమార్గం : మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జోగ్ జలపాతం 219 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- రైలు ద్వారా : సమీప రైల్వే స్టేషన్ తలగుప్ప రైల్వే స్టేషన్ (జోగ్ జలపాతానికి 20 కి.మీ దూరంలో).
- రోడ్డు మార్గంలో: బెంగుళూరు నుంచి 411 కి.మీ దూరంలో ఉన్న జోగ్ జలపాతానికి రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు.
జోగ్ జలపాతాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు శరావతి అడ్వెంచర్ క్యాంప్ జంగిల్ లాడ్జెస్, రిసార్ట్స్ అందుబాటులో ఉంటాయి. ప్రకృతిని ఎంజాయ్ చేసేవారికి ఈ ప్రదేశంలో చాలా అద్భుతంగా ఉంటుంది. జోగ్ ఫాల్స్ సమీపంలో బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు హోటళ్లు ఉన్నాయి. సందర్శకుల కోసం మలెనాడు ప్రాంతంలో హోమ్‌స్టేలు అందుబాటులో ఉన్నాయి.
జోగ్ ఫాల్స్ సమీపంలో చూడదగిన ప్రదేశాలు
జోగ్ జలపాతం సమీపంలో హొన్నెమరాడు (20 కి.మీ.), కేలడి (35 కి.మీ.) సందర్శించదగిన ప్రదేశాలు. వాట్కిన్స్ ప్లాట్‌ఫారమ్ జోగ్ జలపాతాన్ని వీక్షించడానికి ఒక ప్రసిద్ధమైన ప్రదేశం. అలాగే బొంబాయి బంగ్లా సమీపంలోని రాక్ అవుట్‌క్రాప్ నుంచి జలపాతం సుందరమైన దృశ్యాన్ని చూడవచ్చు. జలపాతం సమీపంలో ఉన్న ప్రాంతం ట్రెక్కింగ్‌కు కూడా అనువుగా ఉంటుంది. స్వర్ణ నదీతీరం, శరావతి లోయ, జలపాతాల చుట్టూ పచ్చని అడవులు ఎంతో సుందరంగా ఉంటాయి. ఈ జలపాతం సమీపంలోని డబ్బే జలపాతం , లింగనమక్కి ఆనకట్ట , తుంగా ఆనకట్ట , తైవరే కొప్పా లయన్ అండ్ టైగర్ రిజర్వ్, శరావతి నది చూడదగిన ప్రదేశాలు.
సంబంధిత కథనం