Pawan Kalyan : వాలంటీర్ వ్యవస్థను వదలని పవన్, జగన్ పాత వీడియో పోస్ట్ చేసి మూడు ప్రశ్నలు!-janasena chief pawan kalyan posted ys jagan old video on data asked three questions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : వాలంటీర్ వ్యవస్థను వదలని పవన్, జగన్ పాత వీడియో పోస్ట్ చేసి మూడు ప్రశ్నలు!

Pawan Kalyan : వాలంటీర్ వ్యవస్థను వదలని పవన్, జగన్ పాత వీడియో పోస్ట్ చేసి మూడు ప్రశ్నలు!

Bandaru Satyaprasad HT Telugu
Jul 23, 2023 02:49 PM IST

Pawan Kalyan : మై డియర్ వాట్సన్ ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటూ సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ మూడు ప్రశ్నలు సంధించారు. వాలంటీర్ వ్యవస్థపై మరోసారి ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawan Kalyan : ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్ల వార్ కొనసాగుతోంది. నిన్న బైజూస్ ఒప్పందం, వాలంటీర్లను ఓటర్ల తనిఖీల్లో వినియోగించడంపై ఏపీ ప్రభుత్వంపై పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా మరోసారి వాలంటీర్ల లక్ష్యంగా పవన్ ప్రశ్నలు సంధించారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మాట్లాడిన వీడియోను పోస్టు చేసిన పవన్... ఏపీ ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు. వీటికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ఏపీ వాలంటీర్ వ్యవస్థపై చర్చ జరుగుతోంది. వాలంటీర్లు సేకరించిన వ్యక్తిగత సమాచారం ఎక్కడికి వెళ్తుందని పవన్ ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లు తప్పుచేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని పవన్ నిలదీస్తున్నారు. ఈ అంశంపై మరోసారి పవన్ ట్వీట్ చేశారు. ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం జగన్ ను కోరారు.

yearly horoscope entry point

1. వాలంటీర్లకు బాస్‌ ఎవరు?

2. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?

3. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు?

మై డియర్ వాట్సన్

వాలంటీర్ల వ్యవస్థపై వరుస ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి ట్వీట్ చేశారు. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు... కేసులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయినా పవన్ వెనక్కి తగ్గడంలేదు. ఈ విషయంలో తగ్గేదేలే అంటున్న పవన్... కోర్టుల్లో తేల్చుకుంటామంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ మరింత దూకుడు పెంచారు. ఆదివారం పవన్ కల్యాణ్ ట్విటర్‌ వేదికగా మూడు ప్రశ్నలు వేశారు. మై డియర్ వాట్సన్ అంటూ సీఎం జగన్‌ను సంబోధిస్తూ... అందరి ఆందోళన ఒక్కటే.. మీరు సీఎం అయినా, కాకపోయినా డేటా గోప్యత చట్టాలు మారవన్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు డేటా చౌర్యం గురించి మాట్లాడిన వీడియోను పవన్ షేర్ చేశారు. ఆధార్, బ్యాంకు ఖాతా లాంటి వ్యక్తిగత సమాచారం ఎవరైనా ప్రైవేటు వ్యక్తి వద్ద ఉంటే అది క్రైమ్ అని గతంలో జగన్ అన్నారు.

ఓటర్ల వెరిఫికేషన్ లో విధుల్లో వాలంటీర్లు

ఎన్నికల్లో విధుల్లో వాలంటీర్లను ఉపయోగించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నా.. కొందరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓటర్ల లిస్టు తనిఖీ కోసం వాలంటీర్లను వెంటపెట్టుకుని వెళ్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొనకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ వైసీపీ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేస్తుందని పవన్ ఆరోపించారు. వాలంటీర్లను ఓటర్ వెరిఫికేషన్ లో వినియోగిస్తున్నారని పలు పేపర్ల క్లిప్పులను ట్వీట్ చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ సీఈవోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్‌లో పేర్కొన్న పేపర్ కటింగ్‌లో ఉన్న బీఎల్వోలను ఇప్పటికే సస్పెండ్ చేశామని అధికారులు అంటున్నారు. కర్నూలు జిల్లాలో వాలంటీర్ల ఓటర్ల వెరిఫికేషన్ లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ జిల్లా కలెక్టర్ డా.సుజనా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వాలంటీర్లను తీసుకెళ్లిన అధికారులను సస్పెండే చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Whats_app_banner