Pawan Kalyan : గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు దక్కొద్దు
Janasena Party Latest News: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నాయకులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వైసీపీ రహిత గోదావరి జిల్లాలుగా చూసే దిశగా జనసేన పార్టీ ప్రణాళిక ఉండాలని దిశానిర్దేశం చేశారు.
Pawan Kalyan Latest News: వైసీపీ రహిత గోదావరి జిల్లాలుగా చూసేందుకు జనసేన పార్టీ ప్రణాళిక ఉండాలన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన… పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. బలమైన సిద్ధాంతమే మనందరినీ కలిపిందని వ్యాఖ్యానించారు. తన తరపు ప్రతినిధులుగా ప్రజల్లోకి వెళ్లి పని చేయాలని సూచించారు. త్యాగంతో కూడిన బాధ్యత గల నాయకులుగా ఎదగాలని అభిప్రాయపడ్డారు. గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కొద్దని... ఆ దిశగా మనమంతా పని చేయాలన్నారు.
డబ్బు, పేరు కాదు.. పార్టీ శ్రేణులను బలమైన ఆలోచనా విధానం కలిపిందని వ్యాఖ్యానించారు. మొదటి నుంచి ఓ నిర్దిష్ట విధానంలో తాను బతకాలని అనుకున్నానని... క్రమశిక్షణతో పాటు సమాజాన్ని చదువుతూ ముందుకెళ్లగలిగానని చెప్పుకొచ్చారు. నిత్యం నా మనసు బరువుగా ఉంటుందన్న ఆయన.... ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పే వేల వేదనలు నిత్యం వింటూ, రాత్రి వేళ వారి గురించి ఆలోచిస్తూ బరువెక్కిన గుండెతో నిద్రపోతానని తెలిపారు. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు లేవని... ప్రజల వేదనలు, వారి కన్నీటి గాథలే నన్ను మరింత రాటు దేల్చాయన్నారు.
"ఘోరమైన ఓటమి తర్వాత కూడా నేను నిలబడి ఉన్నానంటే వారికి ఏదైనా మేలు చేయాలన్న బలమైన సంకల్పమే ముందుకు నడిపిస్తోంది. నాకు డబ్బు వ్యామోహం లేదు. డబ్బు మనిషిగా మారితే పోరాట బలం పోతుందని బలంగా నమ్మేవాడిని. పీడితుల కోసం బలమైన భావజాలం ఉండాలని, అది నిర్దుష్టంగా ఉండాలని నమ్మే వ్యక్తిని. పార్టీ కోసం నిత్యం వేలాది మంది పనిచేస్తున్నారు. జనసేన పార్టీకి కోట్లాది మంది మద్దతు ఉంది. అందరినీ నేను కలవకపోవచ్చు. మీరు మాత్రం నా ప్రతినిధులుగా వారిని కలవండి. ప్రజల కష్టాలను వినే నాయకుడే భవిష్యత్తులో బలంగా మారతాడు. నన్ను చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయి నుంచి, మిమ్మిల్ని చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయికి ప్రజలను తీసుకురావాలి. వారి కష్టాల్లో, కన్నీళ్లలో జనసేన ప్రతినిధులుగా మీరు తోడుగా ఉండాలి" అని జనసేనాని పవన్ కళ్యాణ్ కోరారు.
ప్రాణహాని ఉంది - పవన్
ప్రస్తుతం జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో బలంగా ఉందన్నారు పవన్ కల్యాణ్. "అధికారం నుంచి పాలకులను గద్దె దించే దిశగా పయనిస్తోంది. ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. నాకు ప్రాణహాని ఉంది. సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉంది. కచ్చితంగా భద్రతా నియమాలను నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు తప్పనిసరిగా పాటించాలి. నేటి వైసీపీ పాలకులు అధికారం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే. నన్ను భయపెట్టే కొలది నేను మరింత రాటు దేలుతాను" అని పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు.
సంబంధిత కథనం