Vijayawada Rains : మళ్లీ వర్షం.. విజయవాడ వాసుల్లో టెన్షన్‌.. బుడమేరకు వరద పెరిగే అవకాశం!-it will rain again in vijayawada city and budameru is likely to flood ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Rains : మళ్లీ వర్షం.. విజయవాడ వాసుల్లో టెన్షన్‌.. బుడమేరకు వరద పెరిగే అవకాశం!

Vijayawada Rains : మళ్లీ వర్షం.. విజయవాడ వాసుల్లో టెన్షన్‌.. బుడమేరకు వరద పెరిగే అవకాశం!

Basani Shiva Kumar HT Telugu
Sep 05, 2024 10:11 AM IST

Vijayawada Rains : భారీ వర్షాలతో తల్లడిల్లిపోయిన విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద నీరు తగ్గి ప్రజలు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వర్షాలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. అటు బుడమేరుకు వరదలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

విజయవాడలో మళ్లీ వర్షాలు
విజయవాడలో మళ్లీ వర్షాలు

విజయవాడ నగరంలో మళ్లీ వర్షం కురుస్తుంది. వర్షం పడుతుండడంతో బెజవాడ వాసులు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం రెండు అడుగుల వరకు వరద నీరు ఉంది. అటు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ వర్షం పడుతుండటంతో.. బెజవాడ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా పలు ప్రాంతాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. మళ్లీ వస్తున్న వర్షం కారణంగా.. బుడమేరుకు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికీ పూర్తిగా తగ్గలేదు..

విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వరద పూర్తిగా తగ్గలేదు. దీంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వరద తగ్గిన ప్రాంతాల్లో సిబ్బంది రోడ్లను శుభ్రం చేస్తున్నారు. వాటర్‌ ట్యాంకర్లు ఏర్పాటు చేసి.. రోడ్లపై పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు. నగరంలో ధ్వంసం అయిన రోడ్లకు మరమ్మత్తులు చేస్తున్నారు. వరదల్లోనే ఉన్న ప్రజలకు ఆహారం, నీరు సరఫరా చేస్తున్నారు. వర్షం తగ్గితే.. సాయంత్రం వరకు సాధారణ పరిస్థితులు నెలకొనవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

5 రోజులుగా కరెంట్ బంద్..

విజయవాడలోని వాంబే కాలనీ, సింగ్ నగర్‌లో పరిస్థితి కాస్త మెరుగుపడింది. అటు విజయవాడలోని చాలా ప్రాంతాల్లో 5 రోజులుగా కరెంట్ లేదు. దీంతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు నగరంలోని కాలువల్లో వాహనాలు బయటపడుతున్నాయి. తమతమ వాహనాల కోసం యజమానులు వెతుకుతున్నారు. కార్లు, బైకులు, ఆటోలు వరదల్లో కొట్టుకుపోయాయి. వాటి కోసం వెతుకులాట ప్రారంభం అయ్యింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.

నేటి నుంచి నిత్యావసరాలు..

అటు నేటి నుంచి వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ముంపు కాలనీల్లో పంపిణీ చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పారిశుద్ధ్య పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించింది. దీంతో వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు ప్రారంభం అయ్యాయి. ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

వరదల్లో లంక గ్రామాలు..

విజయవాడలో బుడమేరు వరద తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే.. మరో ప్రాంతంపై బుడమేరు ప్రతాపం చూపిస్తోంది. కొల్లేరు లంక ప్రాంతాలపై బుడమేరు పడగ విప్పుతోంది. అనేక లంక గ్రామాలు బుడమేరు వరదల్లో చిక్కుకున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో అధికారులు అలెర్ట్ అయ్యారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

వైసీపీ నేతల సాయం..

విజయవాడలో వరద బాధితులకి వైసీపీ నేతలు సాయం చేస్తున్నారు. నగరంలోని 17,18వ డివిజన్లలో ఉదయం నుంచి పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయలు సాయం ప్రకటించారు.. మాజీ వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి.