Vijayawada Floods : బుడమేరులో మళ్లీ పెరుగుతున్న వరద..! ఆందోళనలో బెజవాడ వాసులు-water level increase in budameru canal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Floods : బుడమేరులో మళ్లీ పెరుగుతున్న వరద..! ఆందోళనలో బెజవాడ వాసులు

Vijayawada Floods : బుడమేరులో మళ్లీ పెరుగుతున్న వరద..! ఆందోళనలో బెజవాడ వాసులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 04, 2024 06:24 PM IST

విజయవాడ నగరాన్ని మరోసారి బుడమేరు భయపెడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో బుడమేరులోకి వరద ఉధృతి కొసాగుతోంది. ఈ క్రమంలోనే మూడు చోట్ల గండి పడింది. ఇప్పటికే మొదటి గండిని పూడ్చగా… మరో 2 గండ్లు పూడ్చేలా పనులు జరుగుతున్నాయి. మంత్రి లోకేశ్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.

బుడమేరు
బుడమేరు

బుడమేరులో మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతోంది. పలుచోట్ల గండ్లు పడటంతో అధికార యంత్రాంగం వెంటనే అప్రమతమైంది.యుద్ధప్రాతిపదికన గండ్లు పూడ్చే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో… మంత్రి లోకేశ్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.

బుడమేరులో వరద ఉద్ధృతి పెరగటంతో విజయవాడ నగరంలోని ముంపు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ జక్కంపూడి, సింగ్ నగర్ ప్రాంతాలకు వరద నీరు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. శాంతినగర్ గండిని పూడ్చే పనులు ముమ్మరమయ్యాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రి నిమ్మల రామానాయుడు కలిసి లోకేశ్ పరిశీలించారు. అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేసి మొదటి గండి పూడ్చారు. గత ఐదేళ్లలో కనీస మరమ్మత్తుల పనులు కూడా చెయ్యకపోవడమే గండ్లు పడటానికి ప్రధాన కారణమని అధికారులు వివరించారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేశారు.

ఆ తర్వాత బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేశ్ పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతమ‌య్యేలా చూస్తున్నారు. ప్రధానంగా 2,3 వంతెనల వద్ద పడిన గండ్ల నుంచే వరద నీరు అజిత్ సింగ్ నగర్లోకి ప్రవేశిస్తోంది.ఈ నేపథ్యంలో వీటిని పూడ్చి వేయ‌డ‌మే ల‌క్ష్యంగా మొత్తం యంత్రాంగం అంతా ప‌నిచేస్తోంద‌ని మంత్రి లోకేశ్ తెలిపారు.

చర్యలు తీసుకుంటాం - సీఎం చంద్రబాబు

విజయవాడకు బుడమేరు చాలా సమస్యగా తయారైందన్నారు సీఎం చంద్రబాబు. చిన్న చిన్న వాగులన్నీ కలిసి బుడమేరు పెద్దదిగా మారిందని చెప్పారు. “బుడమేరును గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అటు కృష్ణానది, ఇటు బుడమేరు రెండూ కలిసి విజయవాడను ముంచెత్తాయి. గత ఐదేళ్లపాటు ఏం చేశారని వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నాం. వాగులను కబ్జా చేయడమే ఈ దుస్థితికి కారణం. ఆఖరికి పోలవరం కాలవలోనూ మట్టి తవ్వేశారు. ఇంత చేసి, ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నారు. బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం. ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి. వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తాం” అని స్పష్టం చేశారు.

ప్రైవేటు బోట్లు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తే కేసులు పెడతామని చంద్రబాబు హెచ్చరించారు. అరెస్ట్ లు కూడా చేపిస్తామన్నారు. కూరగాయలు, నిత్యావసర వస్తువులు అధిక ధరకి అమ్మితే, కఠిన చర్యలు ఉంటాయన్నారు. రేపటి నుంచి ప్రభుత్వమే తక్కువ రేటుకి కూరగాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.