వరద ప్రభావిత ప్రాంతంలో ఐఏఎస్ అధికారి అతి, నిలువరించిన ఎస్సై
ఒంటి మీద బట్టలు నలగకుండా వరద సహాయ చర్యల్ని పర్యవేక్షిద్దామనుకున్న ఐఏఎస్ అధికారి అతి ప్రవర్తనకు..ఓ సాధారణ ఎస్సై తన విధి నిర్వహణ ద్వారా సమాధానం చెప్పారు. ఈ ఘటన బుధవారం ఉదయం విజయవాడలో జరిగింది. ఐఏఎస్ అధికార దర్పంతో పోలీసులపై చిందులేసిన అధికారి చివరకు కాలి నడకనే వెళ్లాల్సి వచ్చింది.
ఓ ఐఏఎస్ అధికారి చేసిన అతి ప్రవర్తనకు సాధారణ ఎస్సై అడ్డుకట్ట వేసిన ఘటన విజయవాడలో బుధవారం ఉదయం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్ని పర్యవేక్షించడానికి సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రసన్న వెంకటేష్ తన వాహనంలో వచ్చారు.
విజయవాడ బుడమేరు కాలువ వంతెన సమీపంలో పోలీసులు అన్ని రకాల వాహనాలను ఆపి అత్యవసర సేవలు అందించే వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి వేలాదిమంది నిరాశ్రయులు కట్టుబట్టలతో కాలి నడకన ఫ్లైఓవర్‌పై నగరంలోకి వస్తుండటంతో వాహనాల రాకపోకల్ని నిలిపివేయాలని నిర్ణయించారు.
సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుండటం, విఐపిలు, వరద ఉధృతిని చూడటానికి వచ్చే వారితో గత రెండు రోజులుగా సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం కలగడంతో అన్ని రకాల వాహనాలను ఆపేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ముఖ్యమంత్రి సైతం వరద సహాయ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించడంతో విపత్తు సహాయక సేవల్ని అందిస్తున్న వాహనాలను తప్ప అన్ని రకాల వాహనాలను నిలిపివేశారు.
బుధవారం విధులకు వచ్చిన సిబ్బంది, అన్ని స్థాయిల అధికారలుు, డిఐజిలు, ఐజీలు స్థాయి అధికారులు కూడా బుధవారం ఉదయం నుంచి బుడమేరు సెంటర్ నుంచి సింగ్‌నగర్ ఫ్లైఓవర్ మీదుగా కాలి నడకనే వెళుతున్నారు.
వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించే వాహనాలు, అంబులెన్స్‌లు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ వాహనాలను మాత్రమే ఫ్లైఓవర్ మీదకు అనుమతిస్తున్నారు.వరద ముంపు నుంచి బయటకు వస్తున్న ప్రజలు కాలినడకన నగరంలోకి వస్తుండటంతో వారికి ప్రమాదం జరగకుండా వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధించారు. బుధవారం ఉదయం 7గంటల సమయంలో ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ తన వాహనంలో రావడంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.
కారులో ఐఏఎస్ అధికారి ఉన్నారని డ్రైవర్ చెప్పినా, ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయాల్సిందేనని ఎస్సై సమాధానం ఇచ్చాడు. దీంతో కారు దిగిన ప్రసన్న వెంకటేష్ ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. ఓ దశలో తాను డ్యూటీ చేయను వెనక్కి వెళ్లిపోతానంటూ బెదిరించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఐఏఎస్ అధికారి ఘర్షణ పడుతున్న సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు కాలి నడకనే ఫ్లైఓవర్ మీదుగా సింగ్‌నగర్ వైపుకు సాగిపోయారు.
ఎస్సైతో వాగ్వాదం జరిగే సమయంలో ఓ డిఐజీకు ఫోన్ చేసిన ఐఏఎస్, అతనితో మాట్లాడాలంటూ తన ఫోన్ ఇచ్చి వెళ్లి కారులో కూర్చున్నాడు. అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై తనపై అధికారికి కూడా ఉన్నతాధికారుల ఆదేశాలను వివరించి కారును అనుమతించలేనని స్పష్టం చేశాడు. ఐఏఎస్ అధికారి ఫోన్ చేసిన తర్వాత తన వాహనాన్ని అనుమతిస్తారని ఆశించి భంగపడ్డాడు. బుడమేరు కట్టపై విధుల్లో ఉన్న ఎస్సై ఫోన్ వచ్చి తీసుకోవాలని సంజ్ఞ చేయడంతో అధికారి సహాయకుడు వెళ్లి ఫోన్ తీసుకున్నాడు.
చివరకు చేసేది లేక ప్రసన్న వెంకటేష్ కాలి నడకనే ఫ్లైఓవర్ పైకి వెళ్లారు. సగం దూరం వెళ్లిన తర్వాత నడవలేక అటుగా వస్తున్న పోలీస్ బలగాలను తరలిస్తున్న వాహనాన్ని ఆపి తాను ఐఏఎస్ అధికారినని చెప్పి, సిబ్బందితో కలిసి అందులో ఎక్కారు. విధి నిర్వహణలో ఎస్సై వ్యవహరించిన తీరును అక్కడ సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది, వరద బాధితులు అభినందించారు.