Prakasam Barrage : కుట్ర కోణం ఉందా..? బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు
ఏపీలో భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం ఉక్కిరిబిక్కిరి అయిన సంగతి తెలిసిందే. అయితే భారీ వరదల క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీన ప్రకాశం బ్యారేజీని నాలుగు బోట్లు ఢీకొట్టాయి. దీంతో పలు గేట్లు స్వల్పంగా డ్యామేజీ అయ్యాయి. ఈ ఘటనపై తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఘటన జరిగిన తర్వాత వీటిని వెంటనే తీసేసే పనిలో పడిన అధికారులు... తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మర పడవులు బ్యారేజీని ఢీకొట్టడం వెనుకు కుట్రకోణం ఉందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఇదే విషయంపై శుక్రవారం ఇగిరిగేషన్ శాఖ అధికారులు విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.నాలుగు బోట్లు ఢీకొట్టిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. సెప్టెంబర్ 1వ తేదీన తెల్లవారుజాము సమయంలో మూడు భారీ బోట్లతో పాటు మరో చిన్న పడవ వచ్చి గేట్లను ఢీకొట్టినట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు.
ఈ ప్రమాదంలో బ్యారేజీలోని రెండు గేట్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అయితే ఒకేసారి ఇలా పడవలు ఎందుకు వచ్చాయి..? దీని వెనక ఏమైనా కుట్ర ఉందా..? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఫిర్యాదు ఇచ్చారు. ఇరిగేషన్ శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారించనున్నారు.
ఆ రోజు ఏం జరిగింది...?
ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తున్న నేపథ్యంలో.. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బ్యారేజ్ లోని పలు గేట్లను నాలుగు బోట్లు ఢీకొన్నాయి. చాలా వేగంతో బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్నట్టు తెలిసింది. బోట్లు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయింది.
అప్రమత్తమైన అధికారులు... ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు చేపట్టారు. బ్యారేజ్ 69వ గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్ వెయిట్ దెబ్బతింది. జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. సుమారు 17 టన్నుల బరువున్న కౌంటర్ వెయిట్లను క్రేన్లతో బయటకు తీశారు. ఆ తర్వాత 67, 68 , 68 గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. గేట్లకు అడ్డుగా ఉన్న 3 భారీ పడవల తొలగింపునకు చర్యలు చేపట్టారు. బ్యారేజ్ అధికారులు, డ్యాం సేఫ్టీ, ఇంజనీరింగ్ నిపుణలు ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి.
నాగినేని కన్నయ్య నాయుడు రిటైర్డ్ ఇంజినీర్, సాంకేతిక సలహాదారులు. ఆయన దేశంలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో గేట్లు ఏర్పాటు చేయడం, మరమ్మతు చేయడంలో చాలా ఫేమస్. ఆగస్టులో తుంగభద్ర జలాశయంలో వరదలకు కొట్టుకుపోయిన క్రస్టుగేటు స్థానంలో.. కేవలం వారం రోజుల్లోనే స్టాప్‌లాగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా ఆయనను నియమించింది. 2024 ఆగస్టు 29న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇయన ఆధ్వర్యంలోనే బ్యారేజీ మరమ్మత్తు పనులు చేపట్టారు.
ఈ ఘటన జరిగిన సమయంలో కుట్ర జరిగిందన్న వార్తలు బలంగా తెరపైకి వచ్చాయి. ఐదు రోజుల తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేయటంతో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం వెనక నిజంగానే కుట్ర ఉందా..? అన్న చర్చ మొదలైంది. అయితో పోలీసుల విచారణంలో ఏం తేలుతుందనేది ఉత్కంఠగా మారింది..!