TTD : టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు - ఛైర్మన్ భూమన-house sites for all ttd employees said ttd chairman ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd : టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు - ఛైర్మన్ భూమన

TTD : టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు - ఛైర్మన్ భూమన

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 16, 2023 12:35 PM IST

TTD Latest News: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.

వడమాలపేట వద్ద ఉన్న ఇంటిస్థలాల పరిశీలన
వడమాలపేట వద్ద ఉన్న ఇంటిస్థలాల పరిశీలన

TTD Chairman Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగులు అంతర్గత ఇబ్బందులు విడనాడి ఏకంగా తమకు సహకరించాలని ఆయన కోరారు. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం మంజూరు చేసిన 310 ఎకరాల భూమిని ఈవో ఎవి ధర్మారెడ్డి, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో కలసి మంగళవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ భూమన మీడియాతో మాట్లాడుతూ… సెప్టెంబరు18వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇంటిస్థలాల పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు. అవసరమైతే మరో 100 ఎకరాలైనా ప్రభుత్వం నుండి సేకరించి అందరికీ ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. ఈ ప్రకటనతో ఉద్యోగులు ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, తాను ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకునే వారమని కరుణాకర్ రెడ్డి చెప్పారు. దివంగత సీఎం డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తన కృషితో ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పదేళ్ళపాటు ఈ సమస్యను ఎవరూ పట్టించుకోని విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన చెప్పారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ… ఉద్యోగులకు 35×55 అడుగుల ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. దాదాపు 7 వేల మంది ఉద్యోగులకు ఇక్కడ ఇంటి స్థలాలు రావడంతో పెద్ద టౌన్ షిప్ తయారవుతుందన్నారు. చెన్నై హైవే పక్కనే ఈ స్థలం ఉండడంతో మంచి ధర పలుకుతోందన్నారు. ఛైర్మన్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 18 లోపు ఈ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి, కచ్చారోడ్లు వేసి తుడా అనుమతి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పట్టుదల, కృషి తోనే ఉద్యోగులకు ఇంటిస్థలాలు వస్తున్నాయని ఆయన చెప్పారు.

వాచీల వేలం…

Tirumala Srivari Watches Auction: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను వేలం వేయనుంది టీటీడీ. ఆగస్టు 17వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో హెచ్ఎంటి, సీకో, సిటిజన్, టైమ్స్, సోని, టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 14 లాట్లు వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయ వేళల్లో సంప్రదించాల్సి ఉంటుందని తిరులమ తిరుపతి దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Whats_app_banner