Tirumala Darshan Updates: తిరుమల శ్రీవారి దర్శనాలు పెంచలేమని తేల్చేసిన భూమన-ttd chairman bhumana karunakar reddy has decided that the number of darshans of tirumala srivari cannot be increased ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Darshan Updates: తిరుమల శ్రీవారి దర్శనాలు పెంచలేమని తేల్చేసిన భూమన

Tirumala Darshan Updates: తిరుమల శ్రీవారి దర్శనాలు పెంచలేమని తేల్చేసిన భూమన

HT Telugu Desk HT Telugu
Aug 10, 2023 04:52 PM IST

Tirumala Darshan Updates: తిరుమలలో గరిష్ట సంఖ్యలో శ్రీవారి దర్శనాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయని, ఆ సంఖ్యను మరింత పెంచే అవకాశాలు ఏమాత్రం లేవని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

Tirumala Darshan Updates: మూడు పర్యాయాలు పాలక మండలి సభ్యుడిగా, రెండో విడత అధ్యక్షుడిగా అవకాశం దక్కడంపై టీటీడీ ఛైర్మన్ భూమన సంతోషం వ్యక్తం చేశారు. సామాజిక హిత కార్యక్రమాలు చేపట్టడానికి టీటీడీ ఛైర్మన్‌ పదవి చక్కటి అవకాశం కల్పిస్తుందన్నారు. పేద భక్తులకు న్యాయం జరగాలని, జనబాహుళ్యంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వారికి న్యాయం చేయడమే తన లక్ష్యమన్నారు.

తన హయంలో ప్రారంభించిన దళితగోవింద, కళ్యాణమస్తు వంటి కార్యక్రమాలను తర్వాత వచ్చిన పాలక మండళ్లు ఎందుకు ఆపేశారో అందరికి తెలుసన్నారు. తన మత విశ్వాసాలపై విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

భక్తులకు తమను తాము హిందువులమని ధైర్యంగా చెప్పుకునే ధైర్యం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఓ సందేశం వెళితే హిందూ సమాజం మొత్తం వాటిని అనుసరిస్తుందన్నారు. తాను సామాన్యుల పక్కన, పేదల పక్క తన రాజకీయాలు నడిచాయని, ధనికుల గురించి తక్కువ మాట్లాడతానని, తన ప్రేమ పేదలపైనే ఉంటుందన్నారు.

దళితగోవిందం, కళ్యాణ ఉత్సవాలు, సామూహిక వివాహాలు, వేంకటేశ్వరుడ్ని సామాన్యుల చెంతకు తీసుకెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. హైందవ ధర్మ ప్రచార కార్యక్రమాలను పున:ప్రారంభించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

హైందవ వ్యాప్తికి ఉపయోగపడే కార్యక్రమాలను తాను చేశానని వాటిని అర్థాంతరంగా ఆపేశారన్నారు. తనపై వచ్చే విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదని, ఎవరి అజ్ఞానం వారిదేనని, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.

గరిష్ట సంఖ్యలో దర్శనాలు….

ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా అన్ని ప్రయత్నాలు జరిగాయని, పేదలకు మరింత మెరుగైన దర్శనం, ఎక్కువ మందికి దర్శనం అనేది కూడా సాంకేతికంగా సాధ్యపడవన్నారు. వాటి కోసం అన్ని ప్రయత్నాలు ఇప్పటికే చేశారన్నారు. సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరుడు మహావిష్ణువు సమక్షంలో పది నిమిషాలు ఉండాలనుకోవడం ఎవరికైనా అత్యాశ అవుతుందన్నారు. పాపాత్ములు స్వామి సన్నిధిలో పది నిమిషాలు ఉన్నా ఉపయోగం ఉండదన్నారు.

సామాన్య భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం చేయించ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తాన‌ని, ధ‌న‌వంతుల సేవ‌లో త‌రించేవాడిని కాద‌ని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ధ‌న‌వంతులు, విఐపిలు ద‌ర్శ‌నాల గురించి తాప‌త్ర‌య‌ప‌డితే స్వామివారి ఆశీస్సులు ల‌భించ‌వ‌నే వాస్త‌వం గుర్తించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

ఎందరో ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు, కార్యనిర్వహణాధికారులు, కార్యనిర్వాహక అధికారులు, ఉద్యోగుల కృషి, స్వామివారి పట్ల అచంచల భక్తి, విశ్వాసం తో పని చేసినందువల్ల టీటీడీలో మంచి వ్యవస్థ ఏర్పడింద‌న్నారు. దీన్ని మరింతగా ముందుకు తీసుకుని వెళ్ళి, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా త‌మ‌ ధర్మకర్తల మండలి ప‌నిచేస్తుంద‌న్నారు.

ద‌ళిత గోవిందం

గ‌తంలో తాను ఛైర్మ‌న్‌గా ప‌నిచేసిన కాలంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీదేవి, భూదేవిని దళితవాడలకు తీసుకుని వెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌న్నారు.

భగవంతుడిని భక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించేలా, స్వామివారి కల్యాణాన్ని వారంతా చూసి ఆనందించేలా శ్రీనివాస కళ్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించిన‌ట్టు చెప్పారు.

పిల్లల పెళ్ళిళ్ళకు అప్పులు చేసి ఆర్థికంగా చితికి పోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూత నివ్వడానికి కళ్యాణమస్తు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించామ‌న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 32 వేలకు పైగా జంటలకు స్వామివారి సమక్షంలో పెళ్ళి చేసి ఆయన ఆశీస్సులు అందింపజేశామ‌ని, త‌ద్వారా మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు ప్ర‌య‌త్నించామ‌ని వివ‌రించారు.

2006 కు ముందు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే అన్నదానం లో భోజనం చేసే అవకాశం ఉండేద‌న్నారు. త‌మ‌ హయాంలో దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తుడు రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కల్పించామ‌న్నారు.

నాలుగుమాడ వీధుల్లో పాదరక్షలు నిషేధం

తిరుమల ఆలయ పవిత్రతను కాపాడటానికి నాలుగుమాడ వీధుల్లో పాదరక్షలతో ప్రవేశాన్ని నిషేధించిన‌ట్టు తెలిపారు. చంటిబిడ్డ తల్లులకు మహాద్వారం పక్క నుండి ఆలయ ప్రవేశం కల్పిస్తున్నామన్నారు.

చంటిబిడ్డలతో స్వామివారి దర్శనానికి వచ్చే తల్లులు క్యూ లైన్లలో చాలా ఇబ్బందిపడే వార‌ని, దీన్ని గమనించి చంటిబిడ్డ తో పాటు తల్లికి మహాద్వారం పక్కన కుడివైపు నుండి ప్ర‌త్యేక లైన్ ద్వారా ఆలయంలోకి వెళ్ళేలా నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు.

బ్రహ్మోత్సవాలలో విశిష్ట మైన స్వామివారి గరుడ సేవను భక్తులు చూసి తరించడానికి ప్రతి పౌర్ణమికి నాలుగు మాడ వీధుల్లో స్వామివారి గరుడ సేవ జరిపేలా నిర్ణయం తీసుకున్నామ‌న్నారు.

108 అడుగుల అన్నమయ్య విగ్రహం

శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై 32 వేల సంకీర్ణ నలు రచించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 600 జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆయన జన్మస్థలానికి సమీపంలో ఉన్న రాజంపేటలో 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించామ‌న్నారు. అదేవిధంగా శ్రీ‌వారి ఆల‌యంలోని శాస‌నాల‌ను వెలుగులోకి తెచ్చిన సాధు సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి, రాళ్ల‌ప‌ల్లి అనంత‌కృష్ణ‌శ‌ర్మ, వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి విగ్ర‌హాల‌తోపాటు మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ ప్రాజెక్టును ప్రారంభించి విగ్ర‌హాన్ని కూడా ఏర్పాటు చేశామ‌న్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని ఆల‌యాల్లో అర్చ‌కులుగా ప‌నిచేస్తున్న వారికి శ్వేత ఆధ్వ‌ర్యంలో అర్చ‌క శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించామ‌న్నారు.

Whats_app_banner