Road accidents : ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న కార్లు ఇవే- మీరు వాడుతుంటే జాగ్రత్త!
Road accidents 2024 : ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ అకో నివేదిక ప్రకారం హైదరాబాద్, దిల్లీ ఎన్సీఆర్లు రోడ్డు ప్రమాదాల్లో టాప్‌లో ఉన్నాయి. పలు వాహనాలు ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆ వివరాలు..
ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది! ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ అకో విడుదల చేసిన“యాక్సిడెంట్ ఇండెక్స్ 2024” ప్రకారం.. భారతదేశ మొత్తం రోడ్డు ప్రమాదాల్లో మెట్రో నగరాల వాట 78 శాతంగా ఉంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్, దిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ ప్రాంతాలు- ఈ కార్లతో జాగ్రత్త..!
యాక్సిడెంట్ చార్టులో హైదరాబాద్, దిల్లీ ఎన్సీఆర్ అగ్రస్థానంలో ఉండగా.. పుణె, బెంగళూరు నగరాలు వరుసగా 15.9 శాతం, 14.2 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ నగరాల పరిధిలో హై-రిస్క్ ఉన్న ప్రాంతం మాత్రం బెంగళూరులోని బొమ్మనహళ్లి! ఆ తర్వాత నోయిడా, పుణెలోని మరుంజి, ముంబైలోని మీరా రోడ్ వంటివి ఉన్నాయి.
ముఖ్యంగా, ఈ ప్రమాదాలకు గురయ్యే అత్యంత సాధారణ వాహనాలను సైతం అకో తన నివేదికలో పేర్కొంది. ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్న వాహనాల జాబితాలో హ్యుందాయ్ ఐ10, మారుతీ సుజుకీ స్విఫ్ట్, మారుతీ సుజుకీ బాలెనో వంటి కొన్ని ప్రముఖ మోడళ్లు ఉన్నాయి. హ్యుందాయ్ ఐ20, మారుతీ సుజుకీ డిజైర్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
అకో జనరల్ ఇన్సూరెన్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ గుప్తా మాట్లాడుతూ.." ప్రమాదాలు సంభవించే ప్రదేశాలు, అంతర్లీన కారణాలను గుర్తించడం ద్వారా రహదారి భద్రతను పెంచడానికి, సరైన చర్యలను అమలు చేయడంలో విధాన నిర్ణేతలు, నగర నిర్వాహకులకు సహాయపడటమే ఈ నివేదిక లక్ష్యం," అని అన్నారు.
రోడ్డు ప్రమాదాలకు కారణాలేంటి?
రోడ్డు ప్రమాదాలకు గల కారణాల విషయంలో సాధారణం కన్నా మరిన్ని వివరాలను అకో ఈ నివేదికలో వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల్లో 62 శాతం వీధికుక్కలే కారణమని, ఆ తర్వాత 29 శాతం కేసులకు ఆవులు, ఆ తర్వాత గేదెలు 4 శాతం కారణమవుతున్నాయని నివేదిక పేర్కొంది. మద్యం తాగి వాహనాలు నడపడం కంటే కొబ్బరికాయల వల్ల 2.2 రెట్లు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపింది.
అయితే, భారత రోడ్లపై గుంతలు ఇప్పటికీ పెద్ద ప్రమాదంగా ఉన్నాయి! గుంతల సంబంధిత ప్రమాదాల్లో 44.8 శాతం బెంగళూరు నగరంలోనే చోటుచేసుకుంటున్నాయి. 13.3 శాతం, 12.3 శాతంతో దిల్లీ, ముంబై వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మెరుగైన రహదారి భద్రత కోసం పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను అకో రిపోర్టు మరోసారి నొక్కి చెబుతోంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా వాహనాలకు తీవ్ర నష్టం కలిగించాయి. చెన్నైలో మొత్తం ఇన్సూరెన్స్ క్లెయిమ్లలో 22 శాతం మిచాంగ్ తుపాను వల్ల సంభవించి వరదలే కారణం.
ప్రకృతి వైపరిత్యాలను మనం కంట్రోల్ చేయలేము. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, హై- సేఫ్టీ రేటింగ్ కార్లు కొనుగోలు చేసుకోవడం చాలా అవసరం అని నిపుణులు సైతం చెబుతున్నారు.
సంబంధిత కథనం