Tirumala Update : శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఆదివారం హుండీ ఆదాయం 5.05 కోట్లు-heavy rush of pilgrims at tirumala temple ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Update : శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఆదివారం హుండీ ఆదాయం 5.05 కోట్లు

Tirumala Update : శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఆదివారం హుండీ ఆదాయం 5.05 కోట్లు

HT Telugu Desk HT Telugu
Dec 26, 2022 11:24 AM IST

Tirumala Update : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం స్వామివారి హుండీ ఆదాయం రూ. 5.05 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సర్వదర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ

Tirumala Update : తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తోన్న భక్తుల సంఖ్య భారీగా ఉంది. వరుస సెలవుల నేపథ్యంలో వెంకన్న దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే 70, 373 మంది ఏడుకొండలవాడిని దర్శనం చేసుకున్నారు. 32, 954 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం స్వామివారి హుండీ ఆదాయం రూ. 5.05 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సర్వదర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ దర్శనానికి 4 గంటలు.. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా.. టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3వ తేదీన ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని.. ఆ రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని చర్యలు చేపడుతోంది. పర్వదినాలను పురస్కరించుకొని ఆలయాలను సుందరంగా ముస్తాబు చేస్తోంది. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లను శనివారం ఆన్‌లైన్‌లో ఉంచగా .. కేవలం 40 -44 నిమిషాల వ్యవధిలోనే 2.20 లక్షల టికెట్లు బుక్ అయిపోయినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టికెట్లు కొనుగోలు చేసేందుకు ఒకేసారి 2 లక్షల 50 వేల మంది వెబ్‌సైట్‌ని సందర్శించారని.. అయితే ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని టీటీడీ పేర్కొంది. రోజుకు 20 వేల చొప్పున 11 రోజులకు 2.20 లక్షల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు.

శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 నుండి 12.45 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. 12.45 నుండి 1.30 గంటల వరకు మూలవర్లకు తోమాల, కొలువు తదితర సేవలను నిర్వహిస్తారు. అనంతరం... తెల్లవారుజామున 1.30 నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఆలయాల ప్రాంగణంలో చలువ పందిళ్లు, బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Whats_app_banner