AP Caste Census: ఏపీలో ఫిబ్రవరి 15నాటికి కుల గణన-government hopes to complete the caste census in ap by february 15 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Caste Census: ఏపీలో ఫిబ్రవరి 15నాటికి కుల గణన

AP Caste Census: ఏపీలో ఫిబ్రవరి 15నాటికి కుల గణన

Sarath chandra.B HT Telugu
Jan 12, 2024 11:34 AM IST

AP Caste Census: ఆంధ్రప్రదేశ్‌ కులగణనను ఫిబ్రవరి 15నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 19నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టనున్నారు.

జనవరి 19 నుంచి ఏపీలో కులగణన
జనవరి 19 నుంచి ఏపీలో కులగణన

AP Caste Census: ఏపీలో వివిధ కులాలు, ఉపకులాల గణన పూర్తి చేయడం ద్వారా సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 15 నాటికి కుల గణన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీలో కుల గణన నిర్వహించేందుకు రాష్ట్ర మంత్రిమండలి గత ఏడాది నవంబర్ 3న సమగ్ర కుల ఆధారిత జనాభా గణనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కులాల వారీగా సర్వే నిర్వహణకు షెడ్యూల్ ను ప్రకటిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ జనవరి 9వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.

మెరుగైన విధాన రూపకల్పనతో పాటు, పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి అంశాల వివరాలను ఈ కుల సర్వేలో పొందు పరుస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జన గణనలో భాగంగా ఈ-కేవైసీ నమోదు కోసం ఎన్యుమరేటర్లు ప్రజల ముఖ, కనుపాప, ఇతర వివరాలను సేకరించనున్నారు.

ఈ నెల 19 నుంచి 28 వరకు గ్రామాల్లో గ్రామ సచివాలయ ఉద్యోగులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్దేశిత ఎన్యూమరేటర్ల సహాయంతో ఇంటింటి గణన చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఫిబ్రవరి 15 నాటికి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో తుది కుల సర్వే నివేదికను సిద్ధం చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. సర్వేను సమగ్రంగా పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని, భాగస్వాములతో సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్రంలో కుల సర్వేను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన సవరించిన షెడ్యూల్, మార్గదర్శకాలను పాటించేలా సంబంధిత జిల్లా, మండల/ మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను కోరింది.

జనాభా గణన సమయంలో ఇళ్లలో అందుబాటులో లేనివారు, ఇంటింటి ప్రక్రియలో పాల్గొనలేని వారు 2024 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ కుల సమాచారాన్ని నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

కులగణన ద్వారా వెల్లడయ్యే గణంకాలు డేటా ఆధారిత పాలనను మెరుగుపరుస్తాయని మరియు రాష్ట్ర పేదరిక నిర్మూలన మరియు ఇతర పథకాలను లక్ష్యంగా అందించడంలో సహాయపడతాయని ప్రణాళికా విభాగం అధికారి ఒకరు తెలిపారు.

రాష్ట్రంలో కులాలు, ఉపకులాల సంఖ్యను అంచనా వేయడానికి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2023 నవంబర్ 15న కుల సర్వేపై పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.

సచివాలయ సిబ్బంది, ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం గురువారంతో ముగిసింది. శుక్రవారం నాటికి గ్రామాలు, వార్డులకు సంబంధించిన సిబ్బంది, పర్యవేక్షకులు పూర్తిచేయాలని తెలిపింది. 2021 జనాభా లెక్కలతో పాటు కుల సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 నవంబర్లో కేంద్రాన్ని కోరినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఎన్నికల ఏడాది కులగణన చేపట్టింది.

Whats_app_banner