Vallabhaneni Vamsi : హైకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట, ఈ నెల 20 వరకు చర్యలొద్దని పోలీసులకు ఆదేశాలు
Vallabhaneni Vamsi : గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కాస్త ఊరట లభించింది. ఈ నెల 20 వరకు వంశీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించారు. టీడీపీ ఆఫీసుపై దాడిలో కేసులో వంశీ పేరును 71వ నిందితుడిగా చేర్చారు.
Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 20 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
71వ నిందితుడిగా వంశీ
కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. పార్టీ ఆఫీసులోని ఫర్నీచర్ ధ్వంసంతో పాటు వాహనాలకు నిప్పుపెట్టారు. సుమారు 5 గంటలపాటు ఈ దాడి సాగించింది. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు కేసులు పెట్టారు కానీ విచారణ ముందుకు సాగలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ ఆఫీసుపై దాడి కేసు తెరపైకి వచ్చింది. దాడికి పాల్పడిన 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి కోర్టు బెయిల్ ఇచ్చింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 71వ నిందితుడిగా వంశీ పేరు ఉంది. ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారని, వంశీ అమెరికా వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల వంశీని అరెస్టు చేశారన్న వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి. కానీ అది వాస్తవం కాదని పోలీసులు తెలిపారు.
ఈ నెల 20కి వాయిదా
ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వంశీ నియోజకవర్గానికి దూరం అయ్యారు. కుటుంబంతో సహా ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారని ప్రచార జరుగుతోంది. ఇటీవల ఆయన విజయవాడలోని తన నివాసానికి వచ్చిన సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు సైతం దిగాయి. అప్పటి నుంచి వంశీ ఆచూకీ లేదు. అరెస్టు ఊహాగానాల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 20 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలొద్దని పోలీసులకు సూచించింది.
అజ్ఞాతంలో వంశీ
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వంశీ దాదాపుగా అజ్ఞాతంలో ఉంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా నారా లోకేశ్, చంద్రబాబులపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్యంసం సృష్టించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వంశీ ఎన్నికల ఫలితాల తర్వాత హైదరాబాద్‌కు పరిమితం అయ్యారు. రెండు నెలల క్రితం విజయవాడలోని వంశీ అపార్ట్‌మెంట్‌పై యువకులు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు వారిని అదుపు చేయాల్సి వచ్చింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిలో వల్లభనేని వంశీ నేరుగా పాల్గొనక పోయినా, ఎమ్మెల్యే హోదాలో అనుచరుల్ని రెచ్చగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయంపై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. ఈ కేసులో జులై 9న బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని, తర్వాత మరో 5 అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉంది.
టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్‌విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు (క్రైమ్ నంబర్ 137/2023) నమోదు చేశారు. 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడిచేసి నిప్పుబెట్టారు. కార్యాలయంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వారి వాహనాలను తగులబెట్టారు. ఐదు గంటల పాటు తీవ్ర విధ్వంసం సృష్టించారు. గన్నవరం వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితులపై ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సంబంధిత కథనం