Ongole Ysrcp : ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్- టీడీపీలో చేరిన మేయర్, 12 మంది కార్పొరేటర్లు-ongole mayor 12 corporators resigned to ysrcp joins tdp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ongole Ysrcp : ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్- టీడీపీలో చేరిన మేయర్, 12 మంది కార్పొరేటర్లు

Ongole Ysrcp : ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్- టీడీపీలో చేరిన మేయర్, 12 మంది కార్పొరేటర్లు

Bandaru Satyaprasad HT Telugu
Aug 14, 2024 04:21 PM IST

Ongole Ysrcp : ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఒంగోలు మేయర్ సహా 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్- టీడీపీలో చేరిన మేయర్,12 మంది కార్పొరేటర్లు
ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్- టీడీపీలో చేరిన మేయర్,12 మంది కార్పొరేటర్లు

Ongole Ysrcp : వైసీపీకి గడ్డుకాలం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత... ఒక్కొక్కరిగా నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఒంగోలు మేయర్ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీ రాజీనామా చేశారు. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే దామచర్ల వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఒంగోలు పీఠం టీడీపీ కైవసం

అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒంగోలు మేయర్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అనూహ్యంగా విజయం సాధించింది. దీంతో మున్సిపాలిటీల్లో వైసీపీ పట్టు సడలిపోతుంది. ఒక్కొక్కరిగా పార్టీ మారుతున్నారు. ఇప్పటికే చిత్తూరు, విశాఖలో కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలోకి జంప్ అయ్యారు. తాజాగా ఒంగోలులో మేయర్ తో పాటు 12 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు. బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నుంచి పోటీచేసిన దామచర్ల జనార్దన్ ఘన విజయం సాధించారు. దీంతో ఒంగోలు కార్పొరేషన్ లో చక్రం తిప్పిన ఆయన...వైసీపీ నేతలను, కార్పొరేటర్లను టీడీపీ వైపు ఆకర్షించారు. తాజాగా చేరికలతో ఒంగోలు మేయర్ పీఠం టీడీపీ కైవసం అయ్యింది.

స్థానిక సంస్థలపై పట్టుకోల్పోతున్న వైసీపీ

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ స్థానిక సంస్థలపై పట్టుకోల్పోతుంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వైసీపీ ప్రతినిధులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇక పంచాయతీలలో కూడా వైసీపీ బలహీనపడుతుంది. ఎన్నికలకు ముందు ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరగా...తాజాగా 12 మంది కార్పొరేటర్లు మేయర్ టీడీపీ గూటికి చేరారు. ఒంగోలులో ఒకప్పుడు మాజీ మంత్రి బాలినేని చెప్పిందే చెల్లేది. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంతా తారుమారు చేసింది. ఓటమి తరువాత బాలినేని నియోజకవర్గం వైపు చూడకపోవడం, పార్టీ కేడర్ ను పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో వైసీపీ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

వైసీపీకి ఆళ్ల నాని రాజీనామా

అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నాని తన లేఖలో వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. గత ప్రభుత్వంలో నాని డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని 2004లో గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి... జగన్ తో నడిచారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కోటా రామారావు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆళ్ల నాని గెలిచారు. రాష్ట్రంలో వైసీపీ కూడా అధికారంలోకి రావటంతో ఆయన్ను మంత్రి పదవి వరించింది. వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో ఆయన్ను డిప్యూటీ సీఎంగా నియమించారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచే పోటీ చేసిన నాని... ఓటమిపాలయ్యారు. టీడీపీ తరపున పోటీ చేసిన రాధాకృష్ణయ్య విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 62 వేల ఓట్ల తేడాతో ఆళ్ల నాని ఓడిపోయారు.

సంబంధిత కథనం