Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌..!-gannavaram ex mla vallabhaneni vamsi was arrested by the police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌..!

Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 02, 2024 05:42 PM IST

Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

వల్లభనేని వంశీ
వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi Arrest : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేశారు. ఈ కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. ప్రస్తుతం గన్నవరం పోలీసుస్టేషన్ లోనే వంశీ ఉన్నారు. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదే కేసులో వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడుగా పేరొందిన యూసఫ్ పఠాన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరో అనుచరుడు రమేశ్ ను గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా వంశీ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు తెలిసింది. పక్కా సమాచారంతోనే వంశీ ఎక్కడ ఉన్నాడనే దానిపై ఓ అంచనాకు వచ్చారు సమాచారం.

ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై మెరుపు దాడి జరిగింది. ఈ దాడి వెనక వైసీపీ నేతల కుట్ర ఉందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తూ వచ్చారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టారు. అయితే వంశీ ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందనేది తెలుగుదేశం నేతల అనుమానం. 

ఈ ఘటన జరిగినప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో సరిగా విచారణ జరగలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే…. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా… తాజాగా మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

కొద్దిరోజులుగా పోలీసులు వంశీ కోసం గాలిస్తున్నారు. కానీ ఆచూకీ దొరకటం లేదు. హైదరాబాద్ లో నివాసం ఉన్నట్లు సమాచారం అందింది. ఈ క్రమంలోనే కీలక అనుచరులు అరెస్ట్ కావటంతో…. పక్కా సమాచారం అందినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Whats_app_banner