AP Polycet Free Coaching 2024: పాలిసెట్ రాసే(AP Polycet 2024) అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సాంకేతిక విద్యాశాఖ. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉచితంగా కోచింగ్(AP Polycet Free Coaching) ఇవ్వనుంది. ఈ తరగతులు ఏప్రిల్ 1వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భారీగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… మిగిలిపోయినవారు ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ సాంకేతిక విద్యాశాఖ కమిషన్ చదలవాడ నాగరాణి తెలిపారు. అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ఏప్రిల్ 25 వరకు నిరవధికంగా క్లాసులు జరుగుతాయని ప్రకటించారు.
పాలిటెక్నిక్ ప్రవేశాల పెంపు లక్ష్యంగా పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష కోసం ఏప్రిల్ 1వ తేదీ నుండి విద్యార్ధులకు సమగ్ర శిక్షణ అందించనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. 2023 - 2024 విద్యా సంవత్సరంలో పదవతరగతి పరీక్షలకు హాజరైన విద్యార్దులతో పాటు, సప్లిమెంటరీ పరీక్షలలో పదవతరగతి పాసైన వారికి సైతం ఉచిత శిక్షణకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే అయా ప్రభుత్వ, ప్రవేటు పాలిటెక్నిక్ లలో ఉచిత శిక్షణ కోసం వేలాదిగా విద్యార్ధులు నమోదు అయ్యారని వివరించారు. సోమవారం(ఏప్రిల్ 1, 2024) కూడా ఆసక్తి ఉన్నవారు అయా కళాశాలల ప్రిన్సిపల్స్ ను సంప్రదించవచ్చన్నారు.
87 ప్రభుత్వ పాలిటెక్నిక్స్, 182 ప్రైవేటు పాలిటెక్నిక్స్‌లలో ప్రారంభమయ్యే తరగతులు ఏప్రిల్ 25వ తేదీ వరకు నిర్వహిస్తామని నాగరాణి పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలలో సిద్దం చేసిన ఉచిత పాలిసెట్ కోచింగ్ మాటీరియల్‌ను హాజరయ్యే ప్రతి ఒక్క విద్యార్దికి అందిస్తామన్నారు.
ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు సాగే శిక్షణలో రెండు గంటల పాటు గణితం, ఒక గంట భౌతిక శాస్త్రం, మరో గంట రసాయన శాస్త్రం బోధిస్తారు. ఏప్రిల్ 25వ తేదీన ఫ్రీ ఫైనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ (AP Polycet exam 2024) ప్రవేశ పరీక్షా ఏప్రిల్ 27వ తేదీన జరగనుంది. ఆన్‌లైన్ అప్లికేషన్‌లకు ఏప్రిల్ 5 చివరి తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.