AP Polycet Notification: ఏప్రిల్ 27న ఏపీ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష.. విద్యార్ధులకు ఉచిత శిక్షణ
AP Polycet Notification: ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్ధులకు ఉచితంగా అందిస్తున్నట్లు ఏపీ సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ప్రకటించారు.
AP Polycet Notification పదవ తరగతి తర్వాత ఉజ్వల భవిష్యత్తు, పిన్న వయస్సులోనే ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఉత్తమమైన మార్గం “పాలిటెక్నిక్ విద్య” మాత్రమేనని సాంకేతికి విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం “పాలిసెట్-2024“ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 27వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
పదవ తరగతి చదువుతున్న విద్యార్దులలో పాలిటెక్నిక్ పట్ల మరింత అవగాహన పెంపొందించే క్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి రూపొందించిన సమాచారా కరదీపిక, కరపత్రాలు, గోడ పత్రికలను సోమవారం సాంకేతిక విద్యా శాఖ కేంద్ర కార్యాలయంలో నాగరాణి ఆవిష్కరించారు.
వీటిలో పాలిటెక్నిక్ విద్యతో కలిగే ప్రయోజనాలు, పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసిన విద్యార్ధులు పొందుతున్న ఉపాధి అవకాశాలు, జీత భత్యాల వివరాలను సమగ్రంగా వివరించారు.
పాలిసెట్-2024 ప్రవేశ పరిక్ష గురించి విద్యార్ధులకు మెరుగైన అవగాహన కల్పించే క్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో అవగాహన సదస్సులు నిర్వహించ నున్నామన్నారు.
పదవ తరగతి పరిక్షలు పూర్తయిన వెంటనే రాష్ట్రంలోని 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలలో ఉచితంగా “పాలిసెట్-2024“ ప్రవేశ పరీక్ష కు శిక్షణ ఇవ్వనున్నామన్నారు.
ఈ కోచింగ్ ఇంగ్లీష్, తెలుగు మీడియం లో ఇవ్వడమే కాకుండా, ప్రవేశ పరీక్ష కొరకు రూపొందించబడిన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లేబరేటరీలను ఆధునీకరించి, వసతి కల్పనను సైతం మెరుగుపరచామని నాగరాణి వివరించారు. ఎన్ బిఎ గుర్తింపు పొందిన ప్రభుత్వ పాలిటెక్నిక్ లతో ఈ విద్యా సంవత్సరము (2024-25) నుండి విద్యార్ధులకు మెరుగైన విద్యనందిచుటకు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ సంసిద్దంగా ఉందన్నారు. sarపాలిటెక్నిక్ విద్య పూర్తి అయిన వెంటనే సత్వర ఉపాధి అవకాశములను కల్పించేందుకు వివిధ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు.