Free Travel for Pensioners: ఏపీలో ఆరోగ్య పెన్షనర్లకు కూడా ఇకపై ఉచిత బస్సు ప్రయాణం
Free Travel for Pensioners: ఆంధ్రప్రదేశ్‌లో అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ పెన్షన్లు అందుకుంటున్న వారికి మరో సదుపాయం అందుబాటులోకి రానుంది. వైద్య పరీక్షలు, చికిత్సల కోసం తరచూ ప్రయాణించే వారికి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నారు.
Free Travel for Pensioners: ఆంధ్రప్రదేశ్‌లో అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సలు పొందుతూ ప్రభుత్వం నుంచి పింఛన్లు అందుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం మరో సదుపాయాన్ని తీసుకురావాలని యోచిస్తోంది.
తరచూ వైద్య చికిత్సల కోసం ఉన్న చోటు నుంచి పట్టణాలు , నగరాలకు వెళ్లాల్సి రావడం.. దానికోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తోంది. దీర్ఘ కాలిక సమస్యలకు చికిత్సల్లో భాగంగా వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా అర్హులైన వారికి బస్సు పాస్‌లను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇందులో భాగంగా తీవ్రమైన గుండెజబ్బులు, కిడ్నీ, థలసేమియా, పక్షవాతం, లెప్రసీ, లివర్ సమస్యలు, సీవియర్ హీమోఫి లియా వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రభుత్వం నుంచి ప్రతి నెల పెన్షన్ పొందుతున్న వారికి ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాల అనారోగ్య సమస్యలున్న 51 వేల మందికి ప్రతి నెల పెన్షన్ చెల్లిస్తున్నారు. . వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్లి రావడానికి పెన్షన్ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. పెన్షన్లు అందుకుంటున్న వారిలో సుమారు 35 వేల మంది డయాలిసిస్ సమస్యతో బాధపడే వారు ప్రతి వారం డయాలిసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. వ్యాధి తీవ్రతను బట్టి కొందరు నెలకు రెండు మూడు సార్లు ఆస్పత్రులకు ప్రయాణించాల్సి ఉంటోంది.
రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ రోగుల్లో కొందరికే ప్రభుత్వ పెన్షన్ అందుతోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధ పడే వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులు ఆస్పత్రికి వెళ్లే సమయంలో మాత్రమే 108 సేవలు అందుతున్నాయి. తిరుగు ప్రయాణం సొంతంగా భరించాల్సి వస్తోంది. ఈ సమస్యలు గుర్తించిన ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు కూాడా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఆసుపత్రికి చేర్చడం వరకే అంబులెన్సులు సేవలందిస్తున్నాయి. తిరుగు ప్రయాణంలో వ్యయప్రయాసలు. తప్పడం లేదు. అందుకే ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది.