Kurnool : కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం.. బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో బందోబస్తు
Kurnool : కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు సిద్ధమైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా కర్రల సమరం జరుగబోతోంది. దీనినే బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. దసరా పండగ నాడు అర్ధరాత్రి ఈ ఉత్సవం జరుగుతుంది. మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించిన అనంతరం.. కర్రల సమరం జరగనుంది.
కర్నూలు జిల్లా దేవరగట్టులో శనివారం కర్రల సమరం జరగనుంది. బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పోలీసులు నాలుగు చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. 100 సీసీ కెమెరాలు, ఐదు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. అక్రమ మద్యం, నాటుసారా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 148 మందిని బైండోవర్ చేసినట్టు ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు.
హొళగుంద మండలం దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో బన్ని ఉత్సవ మహోత్సవాలు జరగనున్నాయి. శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను నెరణికి గ్రామం నుంచి తెప్పించామని, ఇక్కడ అర్చకులు గణపతి పూజ, కంకణధారణం, నిశ్చితరోహణం తదితర పూజలు నిర్వహించారని ఆలయ కమిటీ సభ్యులు వివరించారు.
అక్టోబరు 12న నిర్వహించే బన్ని ఉత్సవంలో భాగంగా కర్రల సమరం కార్యక్రమానికి.. జిల్లా యంత్రాంగం అనుమతి మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు, పాల్గొనేవారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ సాంస్కృతిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని.. శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
దేవరగట్టు దసరా ఉత్సవంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి.. హింసను నిరోధించాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గిడ్డయ్య కోరారు. గతంలో బన్ని ఉత్సవం సందర్భంగా ప్రాణనష్టం, గాయాలపాలైన ఘటనలపై గిడ్డయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గత వేడుకల సందర్భంగా తలకు బలమైన గాయాలు కావడం సహా పలు హింసాత్మక సంఘటనలను ఆయన గుర్తు చేశారు.
శాంతి భద్రతల కోసం పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని గిడ్డయ్య విజ్ఞప్తి చేశారు. ఆలయ కమిటీ నిర్లక్ష్యం కారణంగా.. గతంలో చాలామంది గాయాల పాలయ్యారని గిడ్డయ్య వివరించారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని.. ఉత్సవానికి హాజరయ్యే వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.