Cyber Crime : రూ.20 వేలు పంపి రూ.46 లక్షలు దోచేశారు-సైబర్ నేరగాళ్ల కొత్తరకం మోసం-eluru cyber criminals cheated a person with 46 lakhs with mistakenly sent some amount ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cyber Crime : రూ.20 వేలు పంపి రూ.46 లక్షలు దోచేశారు-సైబర్ నేరగాళ్ల కొత్తరకం మోసం

Cyber Crime : రూ.20 వేలు పంపి రూ.46 లక్షలు దోచేశారు-సైబర్ నేరగాళ్ల కొత్తరకం మోసం

Bandaru Satyaprasad HT Telugu
Nov 13, 2024 03:26 PM IST

Cyber Crime : అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో మోసాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని ఓ వ్యక్తికి రూ.20 వేలు పంపి..పొరపాటు వచ్చాయని తిరిగి చెల్లించాలని కోరారు. రూ. 20 వేలు తిరిగి చెల్లించగానే అతడి ఖాతాలోని రూ.46 లక్షలు మాయం అయ్యాయి.

రూ.20 వేలు పంపి రూ.46 లక్షలు దోచేశారు-సైబర్ నేరగాళ్ల నయా మోసం
రూ.20 వేలు పంపి రూ.46 లక్షలు దోచేశారు-సైబర్ నేరగాళ్ల నయా మోసం (Unshplash)

సైబర్ నేరగాళ్లు అమాయకుల కష్టార్జితం కొట్టేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తు్న్నారు. పొరపాటున అకౌంట్ లోకి డబ్బులు కొట్టామని, తిరిగి పంపాలని ఎంతో అమాయకంగా కాల్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అయ్యే అనుకుని డబ్బులు తిరిగి పంపితే క్షణాల్లో మన ఖాతా ఖాళీ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు. ఈ తరహా ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.

రూ.20 వేలు పంపి రూ.46 లక్షలు దోచేసి

ఏలూరులోని అశోక్ నగర్ కు చెందిన శేషగిరి అకౌంట్ కు గుర్తుతెలియని వ్యక్తి రూ.20 వేలు పంపాడు. ఓ వ్యక్తి కాల్ చేసి తాను పొరపాటున వేరొకరికి డబ్బులు పంపబోయి మీ ఖాతాకు జమ చేశానని చెప్పాడు. డబ్బులు తిరిగి తమ ఖాతాకు పంపాలని ప్రాధేయపడ్డాడు. ఆ మాటలు నమ్మిన శేషగిరి వారి చెప్పిన నెంబర్ కు తిరిగి ఆన్‌లైన్ లో డబ్బులు పంపించారు. ఆ తర్వాత...ఈ నెల 10న శేషగిరి ఖాతా నుంచి రూ. 46 లక్షలు విత్‌డ్రా అయినట్లు మేసేజ్ వచ్చింది. శేషగిరి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. రూ.20 వేలు పంపగానే తన ఖాతాలో రూ.46 లక్షలు దోచేశారని... ఏలూరు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని సీఐ వైవీ రమణ తెలిపారు. సైబర్ కేటుగాళ్ల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు

పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్‌ కేటుగాళ్లు రూ.1.45 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆన్‌లైన్‌ పార్ట్‌ టైమ్ జాబ్‌ ప్రకటన చూసి అందులో నెంబర్ ను సంప్రదించారు. చిన్న చిన్న టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు చెల్లిస్తామని సైబర్ నేరగాళ్లు ఓ టెలిగ్రామ్ గ్రూపులో చేర్చారు. టాస్క్‌ల పేరుతో పలు సంస్థలకు గూగుల్‌ రివ్యూలు ఇచ్చి, స్ర్కీన్‌షాట్‌లు పంపమని కోరారు. డబ్బు చెల్లించేందుకని బ్యాంకు అకౌంట్ వివరాలు తీసుకున్నారు. నమ్మకం కలిగించేందుకు ముందుగా కొంత డబ్బు పంపారు. టాస్క్ లకు పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటే కొంత డబ్బు చెల్లించాలని నమ్మించాడు. దీంతో బాధితుడు పలు విడతలుగా రూ.1.45 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత స్పందనలేకపోవడంతో ... మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

సామాన్యుల ఖాతాల్లోకి

సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో అమాయకులను మోసం చేయడమే కాకుండా...పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు. సామాన్యుల నుంచి కొట్టేసిన డబ్బును అమాయకుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బ్యాంక్‌ లావాదేవీలు జరిగిన అకౌంట్లను ఫ్రీజ్‌ చేస్తున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్ల ఖాతాలతో పాటు పలు సంస్థలు, సామాన్యుల అకౌంట్ల ఖాతాలు ఫ్రీజ్‌ అవుతున్నాయి. సంస్థలు పోలీసులను సంప్రదించి ఖాతాలు పునరుద్దరించుకుంటన్నారు. సామాన్యులకు ఏం చేయాలో తెలియక పోలీస్‌స్టేషన్లు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తాము సైబర్‌ నేరగాళ్లకు సహకరించడంలేదని నిరూపించుకునేందుకు సామాన్యు్లు నానా తంటాలు పడాల్సి వస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం