Jagtial Cyber Crime : జగిత్యాల జిల్లాలో ఘరానా మోసం, డాక్టర్ ను బురిడీ కొట్టించి రూ.74.38 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
Jagtial Cyber Crime : స్టాక్ మార్కెట్ లో రూపాయికి నాలుగు రూపాయలు లాభం అంటే ఆశపడిన ఓ డాక్టర్ నిండా మునిగిపోయాడు. సైబర్ మోసగాళ్లు మాటలు నమ్మి ఏకంగా రూ.74.38 లక్షలు పోగొట్టుకున్నాడు.
Jagtial Cyber Crime : దురాశ దుఃఖానికి చేటు.. అది అక్షరాలా నిజమని నిరూపించాడు జగిత్యాల జిల్లాలో ఓ డాక్టర్. రూపాయి పెట్టుబడి పెట్టి నాలుగు రూపాయలు లాభం పొందాలని ఆశపడ్డాడు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే అలవాటు ఉన్న డాక్టర్, నైబర్ నేరగాళ్లకు చిక్కి నిలువునా మునిగాడు. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 74 లక్షల 38 వేలు పోగొట్టుకున్నాడు. ఆలస్యంగా మేల్కొన్న డాక్టర్, పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో ప్రముఖ పిల్లలు వైద్యుడు భూక్యా మహేష్ సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు. నిలువు దోపిడికి గురయ్యాడు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దామన్న ఆశతో నిండా మునిగాడు. ఒకటి కాదు రెండు కాదు 74 లక్షల 38 వేల 812 రూపాయలు పోగొట్టుకొన్నాడు. డాక్టర్ కు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే అలవాటు ఉంది. గతoలో పలుసార్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాడు. అదే క్రమంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్ స్ట్రాగ్రామ్ లోకి వెళ్లి ఒక లింక్ తెరిచాడు. ఆ వెంటనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏసీ మ్యాక్స్ అనే అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొని ఎక్సెల్ స్టూడెంట్ సీ 95 గ్రూప్ లో చేరాలంటూ ఓ లింకు వాట్సప్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు.
నెల రోజుల్లో రూ.74.38 లక్షలు పెట్టుబడి
గత మే 22 నుంచి జూన్ 22 వరకు విడతల వారీగా మొత్తం 24 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాట్సాప్ కాల్ రావడంతో తన దగ్గర డబ్బులు లేవని సబ్స్క్రైబ్ చేయలేనని బదులిచ్చాడు. దాంతో ఏం కాదు.. జమ చేసిన డబ్బులు సరిపోతాయని నమ్మించడంతో సదరు వైద్యుడు సబ్స్క్రైబ్ చేశాడు. వెంటనే 50 లక్షలు కట్టాలని లేదంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందని లైఫ్ రిస్క్ లో పడుతుందని.. కనీసం ఫ్లైట్ ట్రావెల్ టికెట్ కూడా బుక్ చేసుకోలేని పరిస్థితి ఉంటుందని కాలర్ చెప్పడంతో తన వద్ద ఉన్న కొంత డబ్బు ఇంకొంత అప్పు చేసి 50 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత జూన్ 26న ఐపీవోలో పెట్టిన పెట్టుబడి లాభం 1 కోటి 27 లక్షలకు పెరిగిందని... మళ్లీ ఇంకో ఐపీవో సబ్స్కైబ్ చేసుకోవాలని వాట్సప్ కాల్ వచ్చింది. తన వద్ద డబ్బులు లేవని ప్రస్తుతం వచ్చిన డబ్బులు విత్ డ్రా చేసుకుంటానని డాక్టర్ చెప్పాడు. అలాగైతే 20% సర్వీస్ టాక్స్ చెల్లించాలని విత్ డ్రా చేసుకునే మొత్తం కోటి 27 లక్షలకు 30 శాతం డిపాజిట్ చేయాలని అనడంతో కంగుతిన్నాడు.
ఆలస్యంగా మేల్కొని పోలీసులను ఆశ్రయించి
ఆలస్యంగా మేల్కొన్న డాక్టర్, మోసపోయానని గ్రహించి 1930 సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం అందించాడు. వారి సూచన మేరకు మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మోసపోయిన డాక్టర్ అవమానంగా భావిస్తూ మోహం చూపించలేక న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ళ ఘరానా మోసంపై మెట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పది లక్షల రికవరి చేసి కోర్టు ద్వారా బాధితునికి అందించే పనిలో నిమగ్నమయ్యారు. మొబైల్ ఫోన్ లకు వచ్చే లింకులను డౌన్లోడ్ చేసుకొని మోసపోవద్దని మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు కోరుతున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చదువు రాని వాళ్లు సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారంటే ఏమో అనుకోవచ్చు... కానీ చదువుకున్న వాళ్లు ఇలా సైబర్ నేరగాళ్ల బారిన పడటం అందరినీ ఆశ్చర్యానికి అంతకు మించిన ఆందోళనకు గురి చేస్తోంది.
రిపోర్టింగ్: కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం