Godavari Cinema Tree : ప్రాణం పోసుకున్న సినిమా చెట్టు, ఫలించిన ప్రకృతి ప్రేమికుల ప్రయత్నాలు
Godavari Cinema Tree : 150 ఏళ్లు వయస్సు, 300 సినిమాల్లో కనిపించిన సినిమా చెట్టు ఇటీవల గోదావరిలో కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రేమికులు మళ్లీ ఈ చెట్టును బతికించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజమండ్రి రోటరీ క్లబ్ ప్రతినిధుల ప్రయత్నంతో సినిమా చెట్టు మళ్లీ చిగురించింది.
'150 ఇయర్స్ ఇండస్ట్రీ 300 సినిమాలు' ఆ చెట్టు బ్యాగ్రౌండ్. ఇటీవల గోదావరి వరదలకు సినిమా చెట్టు నేలకూలింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున ఉన్న 150 ఏళ్ల వయసున్న సినిమా చెట్టు ఆగస్టు 5న నేలకొరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు సినీ ప్రేమికులతో పాటు కుమారదేవం గ్రామస్థులలో విషాదం నింపింది. ఎంతో మంది సినీ ప్రముఖులను తమ గ్రామానికి తీసుకువచ్చిన ఆ చెట్టు కూలిపోవడంతో గ్రామస్థులు ఆవేదన చెందారు.
ఫలించిన రోటరీ క్లబ్ ప్రయత్నాలు
సినిమా చెట్టు కూలిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ సినిమా చెట్టును బతికించేందుకు గ్రామస్థులు, రాజమండ్రి రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఎలాగైనా ఈ చెట్టుని బతికించాలని ప్రయత్నించారు. దీనికి పునర్జీవం పోసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ముందుగా పడిపోయిన నిద్రగన్నేరు చెట్టు కొమ్మలను తొలగించారు. చెట్టు పడిపోయినా వేళ్లు ఇంకా బతికే ఉన్నట్లు గుర్తించారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు కొన్ని రసాయనాలను చెట్టు కాండం, వేళ్లకు పూశారు. ఈ చెట్టు బతికేందుకు 50 రోజులు పడుతుందని భావించినా...కేవలం నెల రోజుల్లోనే మళ్లీ చిగుర్లు వచ్చాయి. చెట్టు కాండం, కొమ్మల వద్ద పచ్చని ఆకులతో చిగుళ్లు కనిపిస్తున్నాయి. నిత్యం ముగ్గురు వ్యక్తులు ఈ చిగుళ్లను పర్యవేక్షిస్తున్నట్లు రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. రోటరీ క్లబ్ ప్రయత్నాలు ఫలించాలని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ సీన్ తీస్తే సినిమా హిట్టు
150 ఏళ్ల సినిమా చెట్టు ఇటీవల నేలకొరిగింది. సుమారు 300 సినిమాల్లో చాలా సన్నివేశాల్లో కనిపించిన ఈ మహా వృక్షం గోదావరి ఒడ్డున 150 ఏళ్ల పాటు ఎన్నో జీవులకు నీడ నిచ్చింది. గోదావరి కోతతో నీటిలో ఒరిగిపోయింది. 1975లో విడుదలైన పాడిపంటలు సినిమా నుంచి హీరో రామ్ చరణ్ రంగస్థలం వరకు ఎన్నో వందల సినిమాల్లో ఈ చెట్టు కనిపించింది. గోదావరి ఒడ్డునున్న ఈ చెట్టు వద్ద సినిమా సీన్ తీస్తే హిట్టు పక్కా అనే నమ్మకం స్థానికంగా ఉంది. అందుకే ఈ చెట్టును స్థానికంగా సినిమా చెట్టు అని పిలుస్తుంటారు. నిర్మాతలకు, దర్శకులకు వారి సినిమాలో ఈ చెట్టును చూపిస్తే ఈ మూవీ హిట్ అవుతుందన్న ఒక నమ్మకం ఉండేది. వందలాది సినిమాల్లోని సన్నివేశాలు, పాటలు ఇక్కడ తీశారు. మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు సినిమాల్లో ఈ చెట్టు కనిపిస్తుంది.
అలనాటి దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ సినిమా చెట్టు స్పాట్ చాలా ఇష్టం. వారి సినిమాల్లో కనీసం ఒక్క సీన్ అయినా ఈ చెట్టు వద్ద తీసేవారు. డైరెక్టర్ వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారట. ఇటీవల గోదావరి వరద ఉద్ధృతికి ఈ చెట్టు కూలిపోయింది. ప్రకృతి ప్రేమికులు ప్రయత్నాలతో మళ్లీ జీవం పోసుకుంది.