Pawan Kalyan On Vizag Steel Plant : ఆ రోజే అందరూ కలసి వచ్చి ఉంటే- విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan On Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం చేసిన త్యాగాలను మరచిపోకూడదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్యోగులు, భూ నిర్వాసితుల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తానన్నారు. పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో ఉండాలన్నారు.
"32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాలు భూ సేకరణతో ఏర్పాటైన పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమ కోసం అంతమంది చేసిన త్యాగాలను ఎవరూ మరచిపోకూడదు. వారి త్యాగాలతో ఏర్పడిన పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం ప్లాంట్ లో పని చేసే ప్రతి ఒక్కరితోపాటు కార్మిక, ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఉండాలి" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ పరిశ్రమను కాపాడుకొనేందుకు కార్మికులు, ఉద్యోగులు, భూ నిర్వాసితులు తెలియచేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.
ఆదివారం సాయంత్రం విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన వివిధ కార్మిక సంఘాలు, ఉక్కు పరిరక్షణ సంఘాల ప్రతినిధులు పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని కోరారు. 12,500 మంది ఉద్యోగులు, 14 వేలమంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, వారికి కొద్ది నెలలుగా పలు అలవెన్సులు కూడా అందటం లేదని తెలిపారు. తమ ఆవేదనను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆ రోజే అందరూ కలసి వచ్చి ఉంటే
పవన్ కల్యాణ్ స్పందిస్తూ "పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ బతకాలని కోరుకొనేవాడిని. అలాగే సహకార విధానంలో ఉన్నవి నిలబడాలని ఆకాంక్షిస్తాను. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లి మాట్లాడాము. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఎన్ని త్యాగాలు, పోరాటాలతో ఈ పరిశ్రమ ఏర్పాటైందో తెలిపాము. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర సభ నిర్వహించి ఉద్యోగ, కార్మిక సంఘాలు అన్నీ ఒక తాటిపైకి వచ్చి అఖిల పక్షంతో కేంద్రం దగ్గరకు వెళ్లి విజ్ఞాపన ఇద్దామని చెబితే ఎవరూ ముందుకు రాలేదు. ఆ రోజే అందరూ కలసి వచ్చి ఉంటే ఇప్పుడు ఇంత ఆందోళన చెందాల్సి ఉండేది కాదు.ప్రస్తుతం మీ ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తాను" అన్నారు.
విశాఖ ఉక్కును నిలబెట్టుకొనేందుకు కార్మిక, ఉద్యోగ సంఘాల తరఫున చేసే ప్రతిపాదనలు వివరించాలి. అదే విధంగా మన వైపు నుంచి ఉన్న ఇబ్బందులను కూడా తెలుసుకొని సరిదిద్దుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసే వివరాలపై వారితో చర్చించి నివేదికను రూపొందించారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రైవేటీకరణ కాకుండా ఎలా కాపిండింది వివరించారు.
స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేద్దామన్నారా?
ఈ సందర్భంగా చర్చల్లో పవన్ కల్యాణ్ కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడుతూ... నాటి ముఖ్యమంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేద్దామని మీ ముందు ప్రతిపాదించిన మాట నిజమేనా?’ అని అడిగారు. ఆ ప్రతిపాదన వాస్తవమే అని ఆ నేతలు తెలిపారు.
సంబంధిత కథనం