CBN On Vizag Steel: విశాఖ ఉక్కును ఎలా కాపాడాలో తెలుసు.. అబద్దపు ప్రచారాలు నమ్మొద్దన్న చంద్రబాబు
CBN On Vizag Steel: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని, అబద్దాలు, దుష్ప్రచారాలు చేసే వారిని నమ్మొద్దని ఏపీ సిఎం చంద్రబాబు అనకాపల్లిలో ప్రకటించారు. రోడ్లపై గుంతలతో పాటు వారిని కూడా ప్రజలే పూడ్చేస్తారన్నారు.
CBN On Vizag Steel: విశాఖఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాలపై ఏపీ సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అబద్దాల ఫ్యాక్టరీ నుంచి ఈ ప్రచారాలు జరుగుతున్నాయని చంద్రబాబు ప్రకటించారు.
దొంగ మాటలు చెప్పే వారి మాటలు వింటే మన బతుకు ఏమవుతుందో ఆలోచించుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తున్నామని, పనికి మాలిన అబద్దాల ఫ్యాక్టరీగా ఉన్న రాజకీయ పార్టీకి అబద్దాలు ప్రచారం తప్ప ఏమి చేయలేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాను ఒప్పుకున్నానని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఫ్యాక్టరీ ... ఆంధ్రుల హక్కు అని చెప్పి సాధించుకున్న ఫ్యాక్టరీని వదులుకునేది లేదన్నారు. వాజ్‌పాయ్ హయంలో తాను పోరాడి ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నామని, ఫ్యాక్టరీని ఎలా కాపాడాలో తమకు తెలుసన్నారు.
చేతకాని అబద్దాలు చెప్పే వారి మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయన్నారు. అబద్దాలు చెప్పే కొద్ది వాటిని నమ్మాలనిపిస్తుందన్నారు. ప్రైవేటీకరణ తాను ఒప్పుకున్నానని ప్రచారం చేస్తున్నారని, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఫ్యాక్టరీ అనే సంగతి తమకు తెలుసన్నారు. ఆంధ్రుల హక్కుగా పుట్టిన విశాఖస్టీల్ ఫ్యాక్టరీని ఎన్డీఏ కాపాడుతుందన్నారు.
గొర్రె పిల్లను తీసుకెళుతుంటే దానిని కాజేసేందుకు కుక్క పిల్లను తీసుకెళుతున్నావని ఒకరు అంటారని, ఆ తర్వాత ఇంకొకరు, ఆపై మరొకరు అదే పంథాలో ప్రశ్నిస్తే దానిని తీసుకెళ్లే వ్యక్తి కుక్క పిల్లేనని నమ్మి గొర్ర పిల్లను వదిలేస్తే దానిని వాళ్లు కాజేస్తారని, వైసీపీ వాళ్లు కూడా అలాగే చేస్తున్నారని మండిపడ్డారు.
కరడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు, విశాఖను దోచేశారని వారిని వదిలి పెట్టేది లేదన్నారు. ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారు. తాను అధికారంలోకి వచ్చి ఇంకా 30రోజులు కాలేదని, అప్పుడే పెన్షన్లు పెంచామని, రూ.4వేల పెన్షన్ పెంచి ఏప్రిల్ నుంచి రూ.7వేలను ప్రజలకు చెల్లించామన్నారు. పేదలపై తమకు ఉన్న ప్రేమ అదన్నారు.
తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగా డిఎస్సీపై మొదటి సంతకం పెట్టామన్నారు. అందరి భూములన్నీ కొట్టేయాలని చూశారని, ల్యాండ్ టైట్లింగ్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ , జగన్ వేసిన స్కెచ్ రద్దు చేస్తామని చెప్పి, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేశామన్నారు. ఆగష్టు 15నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. పేదలకు అన్నం పెడితే సహించలేని మనుషులు ఉన్నారు. అతని పేరు పలకడం కూడా ఇష్టం లేదన్నారు.
ప్రజల్ని పీడించిన భూతాన్ని నమ్మొద్దని దానిని శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బాధ్యత ప్రజలకు అప్పగించానని చెప్పారు. భూతాన్ని నియంత్రించి ముందుకు వెళ్లాలన్నారు. ప్రజలందరికి ఆదాయం పెంచే మార్గంలో భాగంగా గణనచేస్తున్నట్టు చెప్పారు.