Vijayawada Names: చారిత్రక శాసనాల్లో విజయవాడకు ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా… లిస్ట్‌ ఇదిగో చూడండి..-do you know how many names vijayawada has in the inscriptions see the list here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Names: చారిత్రక శాసనాల్లో విజయవాడకు ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా… లిస్ట్‌ ఇదిగో చూడండి..

Vijayawada Names: చారిత్రక శాసనాల్లో విజయవాడకు ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా… లిస్ట్‌ ఇదిగో చూడండి..

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 10, 2024 04:51 PM IST

Vijayawada Names: చారిత్రకంగా నదీతీరాల్లో విలసిల్లిన నగరాల్లో విజయవాడ ఒకటి. అందుబాటులో ఉన్న శాసనాల్లో శాతవాహనుల కాలం నుంచి విజయవాడ ప్రస్తావన చరిత్రలో ఉంది. కృష్ణానదికి ఉత్తరం వైపున ఉన్న విజయవాడ నగరం ప్రస్తావన అనే శాసనాల్లో వెలుగు చూసింది. చరిత్రలో కృష్ణానదీ తీర నగరానికి అనేక పేర్లు ఉన్నాయి.

నదీతీరాల్లో వెలిసిన నగరాల్లో ఒకటైన విజయవాడకు చరిత్రలో అనేక పేర్లున్నాయి..
నదీతీరాల్లో వెలిసిన నగరాల్లో ఒకటైన విజయవాడకు చరిత్రలో అనేక పేర్లున్నాయి..

Vijayawada Names: ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో విజయవాడ ప్రస్తావన శాతవాహనుల కాలం నుంచి శాసనాల్లో కనిపిస్తుంది. అయా కాలాలను బట్టి రకరకాల పేర్లతో విజయవాడ నగరాన్ని శాసనాల్లో ప్రస్తావించారు.

అందుబాటులో ఉన్న చరిత్ర ఆధారాలతో మధ్యాంధ్రయుగంలో ప్రముఖ శైవమత క్షేత్రాల్లో ఒకటిగా విజయవాడ నగరం ప్రసిద్ధి పొందింది. బెజవాడ పేరును ప్రస్తావిస్తూ ఆయా కాలాల్లో పాలకులు, మాండలీకులు నుంచి సామాన్యుల వరకు వేయించిన శాసనాల్లో విజయవాడ పేరును పలు రకాలుగా పేర్కొన్నారు. .

బెజవాడ:

బెజవాడ పేరు మొదటిసారి పండరంగడు వేయించిన అద్దంకి శాసనంలో కనిపిస్తుంది. "కందుకూరున్బెజవాడ గావించె మెచ్చి" అని. E.I.Vol XIX P. 47లో కనిపిస్తుంది. ఆ తరువాత యుద్ధమల్లుడు వేయించిన శాసనంలోకూడా "బెజవాడ" అని వ్యవహరించారు. "పరగంగ బెజవాడ గొమర స్వామికి భక్తుండై" అని E.I.Vol XV P 9లో కనిపిస్తుంది.

పెచ్చవాడ :

మల్లేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన శాసనాల్లో త్రికోటిబోయడు వేయించిన శాసనంలో 'పెచ్చవాడ' అనే పేరును ఉదాహరించారు. “పెచ్చవాడ కలియమ బోయిపుత్రః" అంటూ సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్‌ వాల్యూమ్ X No 33లో పేర్కొన్నారు.

విజయవాటీపురం:

బెజవాడ శాసనాల్లో ఒకటైన కలివిష్ణువర్ధనుడి చెఱువు మాధవవరం శాసనంలో 'విజయవాటీపురం' అని J.O.R.S. Vol XXIII Part Iలో పేర్కొన్నారు.

విజయవాటీ విషయం

త్యాగిపోతరాజు బెజవాడలో ప్రకటించిన శాసనంలో 'విజయవాటీ విషయం' అని పేర్కొన్నారు. “విజయవాటీ విషయేచ బహూన్ పుణ్యానగ్రహారాన్ ” అంటూ సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్‌ వాల్యూమ్ S.I.I. X No 795లో ప్రస్తావించారు.

బెజవాడ కండ్రవాడ:

క్రీ॥శ॥ 12 వశతాబ్దానికి చెందిన ఒక శాసనంలో “బెజవాడ కండ్రవాడ” అని వ్యవహరించారు.

అర్జునస్యపుర్యాం:

త్యాగివంశీయుడైన పోతరాజు ప్రకటించిన మరో శాసనంలో “అర్జునస్యపుర్యాం" అని విజయవాడను వ్యవహరించారు. “అర్జునస్యపుర్యాం మల్లేశ్రాయాఖిల గురగురవే అంటూ సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్‌ వాల్యూమ్ " S.I.I. X No: 748లో పేర్కొన్నారు.

విజయవాడ

ముప్పల మహాదేవి కరణం కేతరాజు వేయించిన శాసనంలో 'విజయవాడ' అని కనిపిస్తుంది. “(విజ) యువాడ మల్లీశ్వర శ్రీమహాదేవర అఖండ దీపమునకు” అంటూ సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్‌ వాల్యూమ్ S.I.I. IV No: 788 శాసనంలో ఉంటుంది.

విజయవాటికాపురం

దుర్జయనరేంద్రుడి ప్రశస్తిని గురించి తెలియచేసే శాసనంలో బెజవాడ విజయవాటికాపురం అని ఉంటుంది. ఆ శాసనంలో దుర్జయుడు సమధిగత పంచమహాశబ్ద మహామండలేశ్వర పరమమాహేశ్వర “విజయవాటికాపురేశ్వర” త్రిసప్తతిగ్రామాధీశ్వర...” అని ప్రశంసించబడ్డాడు. ఇలా బెజవాడచారిత్రకంగా ఇన్ని విధాలుగా వ్యవహరించబడి, చివరికి విజయవాడగా ప్రసిద్ధిపొందింది.

ఇవి కాకుండా అమ్మవారిని కొలువైన బెజవాడను బీజవాటిక, బీజపురి, బెజ్జంవాడ, చోళరాజేంద్రపురం, అర్జునపురి, ఆంగ్లేయుల పాలనలో బ్లేజ్‌వాడగా కూడా పేర్కొన్నారు. బెజవాడ ఎండల్ని తాళలేక బ్లేజ్‌వాడగా పేర్కొన్నప్పటికీ బెజవాడ నామానికి దానికి సంబంధం లేదు.

బెజవాడ ప్రాంతం చారిత్రకంగా మధ్యాంధ్రయుగంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ కాలంలో శైవమత ప్రాబల్యం ఆంధ్రదేశంలో అమితంగా వ్యాపించటం వల్ల ఎన్నోశైవక్షేత్రాలు ఉచ్ఛస్థితినందుకున్నాయి. శ్రీశైలం, పంచారామాలు, బెజవాడ మల్లికార్జునాలయం వంటి శైవక్షేత్రాలు, వివిధ పాలకుల హయాంలో ఎంతోవైభవోపేతమైన స్థితిని పొందాయి.

ఇలా ప్రసిద్ధిపొందిన దేవాలయాల్లో అటు శైవక్షేత్రంగా ఇటు శక్తిక్షేత్రంగా ప్రాముఖ్యత వహించినవి బెజవాడ దుర్గామల్లేశ్వరాలయాలు. ఈ దుర్గా, మల్లేశ్వర స్వామివార్ల దేవాలయాలకి సంబంధించిన శాసనాల్లో, శ్రీమల్లేశ్వరస్వామికి సంబంధించిన శాసనాలు అత్యధికంగా లభించాయి. వీటిలో శ్రీ కనకదుర్గాలయానికి సంబంధించిన శాసనాలు చాలా కొద్దిగా కనిపిస్తాయి. ఇక ఈ శాసనాల్లో తూర్పు చాణుక్యరాజైన యుద్ధమల్లుడి బెజవాడ శాసనం. 2. త్రికోటి బోయడువేయించిన కిరాతార్జున స్తంభశాసనం 3. పల్లకేతుభూపాలుడి శాసనం 4. మహామాండలిక సింగదేవమహారాజు వేయించిన శ్రీకనకదుర్గాలయశాశనం 5. చట్టపుడు వేయించిన పార్టీశ్వరాలయ శాసనం ముఖ్యమైనవి. మిగిలిన ఇతరశాసనాలు మల్లేశ్వరాలయానికి వివిధ రకాల దానధర్మాల గురించి తెలియచేస్తాయి.

Whats_app_banner