Ycp Roja Behaviour: దగ్గరకు రాకండి.. సెల్ఫీ కోసం వచ్చిన పారిశుధ్య కార్మికులతో రోజా అనుచిత ప్రవర్తన
Ycp Roja Behaviour: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా మహిళా పారిశుధ్య కార్మికుల పట్ల ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తమిళనాడులో దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన సమయంలో సెల్ఫీల కోసం దగ్గరకు వస్తున్న పారిశుధ్య కార్మికులను దగ్గరకు రావొద్దంటూ వారించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Ycp Roja Behaviour: ఆమె నిన్న మొన్నటి వరకు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన మహిళా మంత్రి.. ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో నోరు పారేసుకోవడం ఆమెకు అలవాటే. అనుచిత వ్యాఖ్యలు, వివాదాస్పద వైఖరితో వార్తల్లో ఉండే రోజా తాజాగా ఓ దేవాలయంలో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులను దగ్గరగా రావొద్దు, దూరంగా నిల్చోవాలని సైగలు చేయడం కలకలం రేపింది. ఇటీవల తిరుచ్చెందూర్ సుబ్రమణియస్వామి ఆలయాన్ని దర్శించుకున్న రోజా కుటుంబం దర్శించుకుంది. భర్త సెల్వమణితో కలిసి రోజా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమెతో సెల్ఫీలు దిగేందుకు కొందరు భక్తులు ఆసక్తి చూపించారు. వారితో సెల్ఫీలు తీసుకునేందుకు రోజా అంగీకరించారు.
ఈ క్రమంలో ఆలయంలో పనిచేసే ఇద్దరు మహిళా పారిశుధ్య కార్మికులు కూడా రోజాతో సెల్ఫీలు దిగేందుకు ముందుకు వచ్చారు. పారిశుధ్య విధుల్లో ఉన్న మహిళలు దగ్గరకు వస్తుండటాన్ని గమనించిన రోజా వారిని దూరంగా ఉండమని చేత్తో సైగ చేశారు. పారిశుధ్య కార్మికురాలికి చేయి చూపిస్తూ దూరం జరగమని చెప్పడం వీడియోలో రికార్డైంది.
రోజా ప్రవర్తనపై తమిళ న్యూస్ ఛానళ్లలో వైరల్‌గా మారింది. తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణియస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించిన వరుషాభిషేకంలో రోజా, ఆమె భర్త సెల్వమణి పాల్గొన్నారు. పూజలు నిర్వహించిన తర్వాత బయటకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా వారితో సెల్ఫీలు దిగేందుకు భక్తుల్లో చాలామంది ఆసక్తి కనబరిచారు. అదే సమయంలో అక్కడున్న పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ కోసం రోజా వద్దకు వెళ్లగా దూరంగా నిల్చోవాలని చేయి చూపిస్తూ రోజా చెప్పడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారు కొంత దూరం జరిగి ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు.
గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు…
2014-19 మధ్య కాలంలో కూడా రోజా దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి పీతల సుజాతను అసెంబ్లీలో హేళన చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. పీతల సుజాతను కించపరిచేలా అసెంబ్లీలోనే తీవ్ర ఆరోపణలు చేశారు. మరో సందర్భంలో ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో అరెస్ట్ చేయాలని సవాలు చేశారు. పోలీసులు తన దగ్గరకు రావొచ్చని, తానేమి ఎస్సీ, ఎస్టీని కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో దుమారం రేపింది.