AP TDP : మాకు ఈ ఎమ్మెల్యే వద్దు.. మంగళగిరికి చేరిన తిరువూరు టీడీపీ పంచాయితీ-dissatisfaction of tdp leaders with tiruvuru mla kolikapudi srinivasa rao ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tdp : మాకు ఈ ఎమ్మెల్యే వద్దు.. మంగళగిరికి చేరిన తిరువూరు టీడీపీ పంచాయితీ

AP TDP : మాకు ఈ ఎమ్మెల్యే వద్దు.. మంగళగిరికి చేరిన తిరువూరు టీడీపీ పంచాయితీ

Basani Shiva Kumar HT Telugu
Sep 29, 2024 08:13 PM IST

AP TDP : ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఆయనపై మీడియా ప్రతినిధులు, సొంత పార్టీ నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. కొలికపూడి కారణంగా తిరువూరులో పార్టీకి నష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే అంతా సెట్ చేస్తానని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది.

కొలికపూడి శ్రీనివాసరావు
కొలికపూడి శ్రీనివాసరావు

తిరువూరు టీడీపీ పంచాయితీ మంగళగిరికి చేరింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడిని టీడీపీ శ్రేణులు నిలదీశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. 2 రోజుల కిందట చిట్టెల గ్రామ టీడీపీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే కొలికపూడి దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో కవిత చికిత్స పొందుతున్నారు.

కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన మీడియా ప్రతినిధులు కూడా శనివారం చంద్రబాబును కలిశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. కొలికపూడి ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, విసుగు పుట్టించే కార్యక్రమాలతో ఇప్పటికే పార్టీ నాయకత్వానికి తలనొప్పి ఎదురవుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే ద్వారా అవమానం, బెదిరింపులు జరుగుతున్నాయని కొన్ని ఆధారాలను చంద్రబాబుకు చూపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో తనకు అన్నీ తెలుసని.. సమస్యను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి హామీ ఇచ్చినట్టు తెలిసింది.

కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చారు. నాలుగేళ్ల పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు. దీంతో టీడీపీ పొత్తుల తొలి జాబితాలో ఆయనకు తిరువూరు నుంచి టికెట్‌ లభించింది. టీడీపీ నేతృత్వంలోని కూటమికి మద్దతు పలకడంతో.. తిరువూరు నుంచి సులువుగా గెలిచి తొలిసారి రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు.

అయితే.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొలికపూడి దూకుడు పార్టీని ఇబ్బందులకు గురిచేస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే, సత్వర న్యాయం పేరుతో వైసీపీ నాయకుడి ఇంటిని కూల్చివేయాలని ఆయన ప్రయత్నించడం కలకలం సృష్టించింది. ఈ ఇష్యూలో చంద్రబాబు జోక్యం చేసుకోవలసి వచ్చింది. కొలికపూడి దూకుడు స్వభావంపై చంద్రబాబు మందలించారు.

ఇటు స్థానిక టీడీపీ నేతలు కూడా కొలికపూడిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చిట్టెల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు .. తనను ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపించారు. ఇటు నేరుగా మీడియానే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసింది. దీంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు టీడీపీ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా ఆయన పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపింది. మూడున్నర నెలల్లోనే స్థానిక టీడీపీ శ్రేణులు కూడా ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ క్యాడర్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించిన అభిప్రాయాలు కూడా.. ఆయన వైఖరితో నియోజకవర్గంలో పార్టీ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోందని వచ్చాయి.