Journalist Death: మేడపై నుంచి పడి ఈటీవీ బ్యూరో చీఫ్ నారాయణ కన్నుమూత, చంద్రబాబు, రేవంత్, పవన్ సంతాపం
Journalist Death: మేడపై నుంచి జారిపడి ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.నారాయణ కన్నుమూశారు. ఏపీలో ప్రకాశం జిల్లాకు చెందిన నారాయణ పాతికేళ్లు జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన మృతికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
Journalist Death: ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ మేడ పై నుంచి జారిపడి కన్నుమూశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన నారాయణ సుదీర్ఘ కాలంగా ఈటీవీలో పనిచేస్తున్నారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. నారాయణ హఠాన్మరణంపై మిత్రులు, సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గురువారం ఉదయం అపార్టుమెంట్‌పై వాకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడిటంతో కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భవనం పై నుంచి పడిన వెంటనే సమీపంలోనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. నారాయణకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు 25 ఏళ్లుగా ఈటీవీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వస్తున్నారు.
నారాయణ కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు సన్నిహితులు వివరించారు. కొద్ది నెలల క్రితం బోన్ మారో కాన్సర్ బారిన పడ్డారు. ఈ క్రమంలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో మెరుగైన వైద్య చికిత్సల ను తర్వాత ఆరోగ్యం కొంత కుదుట పడింది. గతంలో సిఎంఆర్‌ఎఫ్ ద్వారా వైద్య చికిత్సలు అందించారు. చికిత్స తర్వాత కోలుకుంటుండగా రెండో సారి క్యాన్సర్ తిరగబెట్టినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్య చికిత్స కోసం ఇటీవల ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఎల్వోసీ కూడా మంజూరు చేసింది.
రెండు రోజుల క్రితం కీమో చికిత్స అందించిన తర్వాత ఇంటి దగ్గరే నారాయణ విశ్రాంతి పొందుతున్నారు. ఉదయం మేడపై వాకింగ్ చేయడానికి మేడపైకి వెళ్లిన సమయంలో కాలు జారి పడిపోయారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించేలోపు కన్ను మూశారు. నారయణ మృతిపై సహచరులు, జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులు విచారం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి సంతాపం…
సీనియర్ జర్నలిస్ట్ నాారాయణ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. నారాయణ నిజాయితీపరుడైన జర్నలిస్ట్ అని కొనియాడారు. ఆయన మృతి కలిచి వేసిందని పేర్కొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ బ్యూరో చీఫ్ నారాయణ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ ఆకస్మిక మృతి బాధాకరమన్నారు. వారి కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అనుభవం కలిగిన పాత్రికేయుడు తన్నీరు ఆదినారాయణ మరణం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఈటీవీ తెలంగాణ బ్యూరో చీఫ్ గా బాధ్యతల్లో ఉన్న శ్రీ ఆదినారాయణ గారికి వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉంది. ఇటీవలి కాలంలో అనారోగ్యానికి గురైన ఆయన కోలుకుంటారని ఆశించానని ఇంతలో మరణ వార్త వచ్చిందని సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆదినారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.