Husnabad Industrial Park: హుస్నాబాద్ నియోజకవర్గంలో 80 ఎకరాలలో, రూ. 431 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్
Husnabad Industrial Park: హుస్నాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా అక్కన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
Husnabad Industrial Park: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్నఇండస్ట్రియల్ పార్క్ స్థాపనకు మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో TGIIC అధికారులు, పారిశ్రామికవేత్తలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని సూచించారు.
యువతకు ఉపాధి లక్ష్యంగా....
వెనుక బడిన హుస్నాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం ద్వారా ఆ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయనే ఉద్దేశంతో అక్కన్నపేట మండల కేంద్రంలో TGIIC ద్వారా 80 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం రూ. 431 కోట్లను మంజూరు చేసిందని, ఆ నిధులతో కాలువల నిర్మాణానికి చర్యలు జరుగుతున్నాయని వెల్లడించారు.
దీంతో పాటు హుస్నాబాద్ ప్రాంతంలో 640 చెరువులు ఉన్నాయని వచ్చే వానాకాలం నాటికి గౌరవెల్లి ప్రాజెక్టు నీటితో హుస్నాబాద్ ప్రాంతంలో అధిక పంటలు పండి, అధిక దిగుబడులు సాధించిడం జరుగుతున్నదని అన్నారు. అందువలన హుస్నాబాద్ లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చాలా అనుకూలంగా మారుతుందని మంత్రి అన్నారు.
పట్టణాలు దగ్గర్లో ఇండస్ట్రియల్ పార్క్....
అదే విధంగా హుస్నాబాద్ ప్రాంతం కరీంనగర్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట పట్టణాలకు 30 నుండి 40 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఇప్పటికే సిద్దిపేట ఎల్కతుర్తి మధ్య ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తుందని, త్వరలోనే 170 కోట్లతో హుస్నాబాద్ కరీంనగర్ ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. హుస్నాబాద్ జనగామ మధ్య ఫోర్ లైన్స్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని తద్వారా రవాణా సమస్య అస్సలే ఉండదని మంత్రి అన్నారు.
ఎలాంటి సమస్యలు లేని ప్రభుత్వ భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ ను నిర్మిస్తున్నందున పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్కులో నీరు, రహదారులు, విద్యుత్తు, డ్రైనేజీ తదితర అన్ని సౌకర్యాలను కల్పించి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని రకాల పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందించాలని మంత్రి కోరారు.
అలాగే సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలంలో ఏర్పాటు చేసిన TGIIC ఇండస్ట్రియల్ పార్కులో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, త్వరలో పరిష్కరిస్తానని ఆయన పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు.
తగిన సహకారం అందిస్తాం: కలెక్టర్
జిల్లా కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి జిల్లా అధికార యంత్రాంగం తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ మధ్యన ప్రభుత్వం ప్రకటించిన MSME స్కీం ప్రోత్సాహం, ఇతర ప్రభుత్వ స్కీములను ఉపయోగించుకోవచ్చని బ్యాంకులతో సమన్వయం చేస్తామని అన్నారు.
అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం....
TGIIC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ అక్కన్నపేటలో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికి ముందే మంత్రివర్యులు పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించడం ఆ ప్రాంత అభివృద్ధికి చాలా దోహదపడుతుందని, అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం తోపాటు పరిశ్రమల ఏర్పాటుకు డిపిఆర్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లకు సహాయం చేసేందుకు మా జోనల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, రామ్మూర్తి, జిల్లా పరిశ్రమల అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి తదితరులు పాల్గొన్నారు.