Mla Mahipal Reddy : ఎమ్మెల్యే పార్టీ మారినా కానిస్టేబుల్ కూడా మాట వినటం లేదట!
Mla Mahipal Reddy : పటాన్ చెరులో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు పోలీసులు భద్రత కల్పించలేదని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 మండలాల నుంచి 1000 మంది బాలబాలికలు క్రీడోత్సవాలకు హాజరవుతున్నా భద్రతకు కనీసం ఒక్క కానిస్టేబుల్ ను కూడా నియమించలేదని ఎమ్మెల్యే మండిపడ్డాడు.
Mla Mahipal Reddy : సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు కేంద్రంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు భద్రత కల్పించాలని పోలీసులను కోరితే.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని 26 మండలాల నుంచి 1000 మంది బాలబాలికలు క్రీడోత్సవాలకు హాజరవుతున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు చూసుకునేందుకు కనీసం ఒక్క కానిస్టేబుల్ ను కూడా నియమించలేదని ఎమ్మెల్యే మండిపడ్డాడు. ఎమ్మెల్యే పార్టీ మారినా పోలీసులు కూడా మాట వినకపోవడం గమనార్హం.
వారం రోజుల క్రితమే ధరఖాస్తు
సోమవారం పటాన్ చెరు పట్టణంలోని మైత్రీ మైదానంలో జిల్లా స్థాయి 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల క్రితమే క్రీడలు జరుగుతున్నాయని, జిల్లా స్థాయిలో క్రీడాకారులు వస్తున్నారని సంబంధిత శాఖ అధికారులు భద్రత కల్పించాలని పోలీసులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సోమవారం ఉదయం భద్రతపై పోలీసులను సంప్రదించినప్పటికీ వారు స్పందించకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల నిర్లక్ష్యంపై డీజీపీకి ఫిర్యాదు
జిల్లా పరిధిలోని 26 మండలాల నుంచి 500 మంది బాలికలు, 500 మంది బాలురు క్రీడోత్సవాలకు హాజరవుతున్న సమయంలో.. ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రశ్నించారు. వారం రోజులపాటు జరిగే క్రీడోత్సవాల్లో ఎలాంటి ఘటనలు జరిగినా స్థానిక పోలీసులే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. పటాన్ చెరు డీఎస్పీ, సీఐ నిర్లక్ష్యంపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
మానసికోల్లాసానికి క్రీడలు ఎంతో ద్రోహదం
మానసికోల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం మిరుదొడ్డి మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF) క్రీడ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. అండర్ 14, అండర్ 17 విభాగంలో నిర్వహించిన క్రీడల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చాటి చెప్పారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని కోరారు. క్రీడల ద్వారా శారీరకదారుఢ్యం, మానసిక ఉల్లాసంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో ఉపయోగపడతాయని తెలిపారు. ఏడాది పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో, యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో విద్యా బోధన చేసే ఉపాద్యాయులకు సరైన విద్య అర్హతలు ఉండటం లేదన్నారు. అలాంటి వాటిపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
సంబంధిత కథనం