Purandeswari On AP Liquor Policy : ఏపీ లిక్కర్ పాలసీపై సీబీఐతో విచారణ జరిపించండి, అమిత్ షాకు పురందేశ్వరి ఫిర్యాదు-delhi bjp chief purandeswari complaint to amit shah on ap liquor policy asked cbi investigation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Purandeswari On Ap Liquor Policy : ఏపీ లిక్కర్ పాలసీపై సీబీఐతో విచారణ జరిపించండి, అమిత్ షాకు పురందేశ్వరి ఫిర్యాదు

Purandeswari On AP Liquor Policy : ఏపీ లిక్కర్ పాలసీపై సీబీఐతో విచారణ జరిపించండి, అమిత్ షాకు పురందేశ్వరి ఫిర్యాదు

Bandaru Satyaprasad HT Telugu
Oct 08, 2023 07:39 PM IST

Purandeswari On AP Liquor Policy : ఏపీ మద్యం విధానంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి... కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. మద్యం విక్రయాలపై అమిత్ షాకు వినతి పత్రం అందించారు.

పురందేశ్వరి
పురందేశ్వరి

Purandeswari On AP Liquor Policy : ఏపీలో మద్యం విక్రయాలు, నాణ్యతపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మద్యం విక్రయాల్లో పెద్ద కుంభకోణం ఉందని టీడీపీ, బీజేపీ ఆరోపిస్తున్నాయి. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఏపీ మద్యం విధానంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అమిత్‌షాతో ఆదివారం దిల్లీలో సమావేశమైన పురందేశ్వరి.... ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఏపీ మద్యం విధానంలో జరుగుతున్న అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని అమిత్ షాను కోరారు. మద్యం కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన విషయాలపై కేంద్ర హోంమంత్రికి వినతిపత్రం అందించారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఓ మద్యం షాపులో తనిఖీ చేయగా లక్ష రూపాయల విక్రయాలకు కేవలం రూ.700కు మాత్రమే డిజిటల్‌ చెల్లింపులైనట్లు గుర్తించామన్నారు. మద్యం విక్రయాలతో వైసీపీ నేతల జేబుల్లోకి భారీ మొత్తాలు వెళ్తున్నాయని ఆరోపించారు. ప్రజల నుంచి డబ్బులు దోచుకుని ఉచితాలు ఇస్తున్నారని పురందేశ్వరి ఆరోపించారు.

yearly horoscope entry point

ఏపీ లిక్కర్ స్కామ్ ఈడీ, సీబీఐకి కనిపించడంలేదా?

రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై విచారణ చేసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చొరవ తీసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి కోరారు. మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు తీస్తూ, జగనన్న సురక్ష అంటూ ప్రజల వద్దకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. జగనన్న సురక్ష అంటూ ప్రజల వద్దకు వెళ్లే అర్హత వైసీపీ నేతలకు లేదని విమర్శించారు. వైసీపీ నేతలకు చెందిన మద్యం బ్రాండ్లనే మాత్రమే లిక్కర్ షాపుల్లో పెడుతున్నారని ఆరోపించారు. ఏడాదికి సుమారు రూ.7 వేల కోట్లు లెక్కల్లో లేని మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. గత నాలుగేళ్లలో రూ.28 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలకు లెక్కలు లేవన్నారని ఆక్షేపించారు. ఏపీ ఎక్సైజ్ లిక్కర్ సేల్స్ వెబ్​సైట్​ను ఎందుకు మూసేశారని సోమిరెడ్డి ప్రశ్నించారు. దిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి డిప్యూటీ సీఎం సిసోడియా సహా చాలా మంది జైళ్లలో పెట్టారన్నారు. ఏపీలో జరుగుతున్న మద్యం కుంభకోణం ఈడీ, సీబీఐకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఏపీలో మద్యం దోపిడీ, నాసిరకం మద్యాన్ని అరికట్టాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Whats_app_banner